Nov 03,2021 06:43

ఎప్పుడూ హుషారుగా ఉండే శ్రీలత ఈరోజెందుకో ఏ పని మీదా మనసు లగం చేయలేకపోతోంది.
ఎవరికీ తెలియకుండా పాపం జాగ్రత్తలు తీసుకుంటున్నా, కాఫీ, టిఫిన్‌ అన్నీ తేడాగానే ఉండడంతో భర్త గౌరీశంకర్‌కు అనుమానం రానే వచ్చింది.
'ఏమిటీరోజు అదోలా ఉన్నావ్‌, వంట్లో బాగోలేదా?' అని అడిగేశాడు.
'అబ్బే, అలాంటిదేమీ లేద'న్న ఆమె సమాధానంతో ఒల్లకుండిపోయాడు.
డ్యూటికెళ్లే టైమవుతున్నా మార్పు లేకపోవడంతో ఇక ఉండబట్టలేక కొంచొం గట్టిగానే భార్యనడిగాడు. దానితో ఇక లాభం లేదనుకుని చెప్పడం మొదలెట్టింది.
'మరేం లేదు. ఎంతాలోచించినా నాకో విషయం అర్ధంకావడం లేదండీ. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కొన్ని భూములను తనఖా పెట్టి, రుణం తీసుకోవాలని నిర్ణయించింది కదా!' అనడంతోనే 'అదో శుద్ధ తప్పుడు నిర్ణయం' అని గౌరీశంకర్‌ టక్కున అనేశాడు.
'అది సరేలెండి కానీ... మీరుండండి! నాదింకా పూర్తి కాలేదు. నా డౌటేంటంటే దేశం మొత్తాన్నే అమ్మేస్తున్న బిజెపి వారు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారూ అని. మోడీ అదంతా తీసుకెళ్లి అంబానీ, అదానీ లాంటి సంపన్నులకు దోచిపెడుతున్నాడు. పోనీ, ఇక్కడి బిజెపి వాళ్ళు కేంద్ర నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తున్నారా? అంటే లేదు సరికదా, సమర్థిస్తున్నారు.
ఆఖరుకు తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ను అమ్మేస్తున్నా సిగ్గు లేకుండా ఇది తమ ప్రభుత్వ విధానమని నమ్మబలుకుతున్నారు. వీరి ఎమ్మెల్సీ అయితే, తాను అక్కడనుండే గెలిచాననే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దీనిని సమర్ధిస్తున్నాడు. వీరి నాయకులు పురందరేశ్వరి గారయితే స్టీల్‌ ప్లాంట్‌ ఎక్కడికీ పోదు. అక్కడే ఉంటుంది. కేవలం యాజమాన్యమే మారుతుందని జనం చెవిలో పువ్వులు పెడుతున్నారు. అదేం చావు తెలివో నాకర్ధం కావడం లేదు. వీరికి తమ ప్రాంతం మీద అభిమానం లేదు, ఎన్నుకున్న ప్రజలపట్ల విశ్వాసమూ లేదు. వీరేం దగుల్బాజీ నాయకులండీ బాబూ?...' అంటుండగానే...
'ఆగాగు. ఇప్పుడు నాకు గుర్తొస్తోంది' అని గౌరీశంకర్‌ చెప్పడం మొదలెట్టాడు. 'అమ్మా, చిన్నమ్మా! మీకు గుర్తు లేదా? వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ...విశాఖపట్నం లోని ప్రభుత్వ రంగ హిందూస్థాన్‌ జింక్‌ పరిశ్రమను వేదాంత బహుళజాతి సంస్థ కొనుక్కుని, దాన్ని మూసి వేసింది ... కేంద్ర మంత్రిగా మీరున్నప్పుడే కదా! అప్పుడు బోళ్డన్ని ప్రగల్భాలు పలికావ్‌. స్టీల్‌ప్లాంట్‌ కీ అదే గతి పట్టదా? నోరుంది కదాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడేయడమేనా? మీరు పార్టీలు మార్చినంత సులువుగా ప్రజలన్నీ మర్చి పోతారనుకుంటున్నారా?'.
'ఏమండీ! నాకో డౌటు. మొన్న ఉత్తర ప్రదేశ్‌ లో కేంద్ర మంత్రి కొడుకు రైతులను కార్లతో తొక్కి చంపేశాడట కదా! మామూలుగా మనం ఎవరినైనా స్కూటర్‌ తో గుద్దితేనే పోలీసులు కేసులు పెడతారు కదా!
మరి నలుగురిని హత్య చేసిన ఇతనిని ఎందుకండీ వెంటనే అరెస్టు చేయలేదు. సామాన్యుడికొక న్యాయం, వీరికొక న్యాయమూనా? ఇదెక్కడి పద్ధతండీ! నాకేం నచ్చలే....'
'నీకే కాదులే. చాలా మందికి నచ్చడం లేదు. సుప్రీం కోర్టుకూ నచ్చలేదు. దాని చివాట్లతోనే కదా ఆఖరుకు అరెస్టు చేశారు. అయినా నీకెప్పుడు ఇన్ని రాజకీయాలు వచ్చేశారు. తప్పులను ఉతికి పారేస్తున్నావ్‌?' అని గౌరీశంకర్‌ అనడంతో...
'మోడీ అండ్‌ కో కోరుకున్నట్లు ఆడవాళ్లు వంటింటికే పరిమితమయ్యే రోజులు పోయాయండీ' అంది.
'అయితే ఇంకేం! లేచింది మహిళా లోకం, ఇక పడదాం వీళ్ళ భరతం' అనుకుంటూ బయలుదేరాడు డ్యూటీకి.
'అయ్యో! ఉండండుండండి. ఇంకో చిన్న డౌట్‌. అది కూడా చెప్పేసి వెళ్ళండి' అనడంతో సరే కానీరు' అన్నాడు గౌరీశంకర్‌.
'ఈ బిజెపి రాష్ట్ర నాయకుల్లా అక్కడో మాట, ఇక్కడో మాట అనేవారిని ఏదో అంటారు కదా! అదేమిటండీ?'
'ఓహో. అదా. అలాంటి వాళ్లను ఇంగ్లీషులో అయితే రోగ్‌ అంటారు. తెలుగులో అయితే పోకిరీ అంటారు' అని అక్కడే ఉంటే ఇంకే డౌట్లు అడుగుతుందోనని కేరేజి పట్టుకుని పరుగెట్టాడు డ్యూటీకి.
- సీతారాం