Jun 10,2023 21:55

ఫొటో : రక్తదాతలను సన్మానించిన రెడ్‌క్రాస్‌

పొణకా కనకమ్మ జీవితం స్ఫూర్తిదాయకం
ప్రజాశక్తి-కావలి : సామాజిక సేవా రంగంలో పనిచేసే మహిళలకు తరగని స్ఫూర్తి పొణకా కనకమ్మ అని కావలి రెడ్‌క్రాస్‌ మహిళా విభాగం కన్వీనర్‌, ప్రముఖ మహిళా రక్తదాత పార్వతిశంకర్‌ పేర్కొన్నారు. టీం సేవియర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ రక్తదాతల దినోత్సవాలలో భాగంగా, జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు పొణకా కనకమ్మ 132వ జయంతి సందర్భంగా శనివారం రెడ్‌క్రాస్‌ భవనంలో మహిళలతో రక్తదానం, సీనియర్‌ మహిళా రక్తదాతలకు సన్మానం కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్వతిశంకర్‌ మాట్లాడుతూ పొణకా కనకమ్మ తన జీవితాన్ని, ఆస్తులను సమాజసేవకు, స్వాతంత్య్ర పోరాటానికి అంకితం చేశారని, పినాకిని గాంధీ సత్యాగ్రహ ఆశ్రమం, కస్తూర్భా విద్యాసంస్థలు స్థాపించారని, జమీన్‌ రైతు పత్రిక ఏర్పాటుకు సహకరించారని తెలిపారు. వారికి భారతరత్న ఇవ్వాలని కోరారు. సీనియర్‌ మహిళ రక్తదాతలు పార్వతిశంకర్‌, స్వర్ణలత, ఉమాశర్మ, షమారహీం, పద్మావతి, శేషమ్మ, వల్లూరమ్మలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేఘన, స్వర్ణలతలు ఆలపించిన సామాజిక గీతాలు సభికులను అలరించాయి. కార్యక్రమంలో టీం సేవియర్స్‌ సభ్యులు కీర్తి, పూజిత, ప్రేక్ష, ప్రణీత్‌ తదితరులు పాల్గొన్నారు.