- కరోనా కారణంగా సన్నద్దతను విస్మరించిన నిర్వాహకులు
టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌కు కరోనా వైరస్ ప్రధాన ముప్పు కావచ్చు కానీ, ప్రకృతి విపత్తులతోనూ ప్రాణాంతకమైన, అనూహ్యమైన ముప్పులు నిర్వహకులకు పొంచి ఉన్నాయి. క్రమం తప్పకుండా వచ్చే భూకంపాలతోనూ, తుపానులతోనూ జపాన్ కొట్టుమిట్టాడుతోంది. అయితే కరోనా వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్‌కు ప్రకృతి విపత్తుల నుంచి సన్నద్దత అనేది వెనక్కి వెళ్లిపోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్వాహకులకు వైరస్ నివారణ చర్యలు మాత్రమే అత్యవసర సవాలుగా ఉన్నాయని విపత్తు ప్రమాదాల అధ్యయనాల నిపుణులు, టోక్యో మహిళా క్రిస్టియన్ యూనివర్శిటీలో ఎమెరిటస్ ప్రొఫెసర్ హరోటడ హిరోస్ విమర్శించారు. 'ఒలింపిక్స్‌కు అతిధ్యం ఇస్తున్న జపాన్‌కు భూకంపాలు ప్రధాన ముప్పు అని మర్చిపోకూడదు' అని హిరోస్ పేర్కొన్నారు. హిరోస్ హెచ్చరికలను ఎంత మాత్రం కొట్టివేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆగేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్రమైన భూకంప చర్యల యొక్క పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌పై జపాన్ ఉంది. ఈ దేశం అనేక క్రియాశీల అగ్ని పర్వతాలకు నిలయంగా ఉంది. టోక్యో, దాని పరిసర ప్రాంతాలు టెక్టోనిక్ ప్లేట్ల షిఫ్టింగ్ జంక్షన్‌పై ఉన్నాయి. దీంతో ఇక్కడ నివాసితులను నిపుణులు, అధికారులు ప్రతీ నిత్యం హెచ్చరిస్తుంటారు. అలాగే, మరోవైపు ఈ దేశంపై మే నుంచి అక్టోబర్ వరకూ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఆగష్టు నుంచి సెప్టెంబర్ వరకూ మరింత తీవ్రంగా ఉంటుంది. 2019లో రగ్బీ ప్రపంచకప్‌కు జపాన్ అతిధ్యం ఇచ్చినప్పుడు తైపూన్ హగిబిస్ కారణంగా మూడు పూల్ మ్యాచులు రద్దు చేయబడ్డాయి. తీవ్రంగా వచ్చిన వరదల కారణంగా 100మందికిపైగా మరణించారు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేసే ముందు, టోక్యో సముద్రం వెంబడి భూకంపం రావడంతో ప్రతిస్పందన రిహారల్స్ కోసం భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కోసం ప్రణాళికలు ఉన్నాయని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు చెబుతున్నా.. వాటి గురించి వివరాలు ఇవ్వడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ జపాన్‌లో ఏడు చెప్పుకొదగ్గ భూకంపాలు సంభవించాయి. అలాగే మార్చిలో ఒక సునామీ హెచ్చరిక కూడా వచ్చింది. అయితే భూకంపాలతో ఒలింపిక్ స్టేడియంలకు ఎలాంటి ముప్పు ఉండదని జపాన్ ప్రభుత్వం చెబుతోంది. విపత్తులను తట్టుకునే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మించామని తెలిపింది. ఒలింపిక్ విలేజ్‌ను కూడా సునామీ కూడా తట్టుకునే విధంగా రూపొందించామని చెప్పింది. అయితే ప్రకృతి విపత్తులు అంచనాలకు అందకుండా ఉంటాయని, మరీ ముఖ్యంగా మహమ్మారి సమయంలో విపత్తు నిర్వహణ విభిన్నంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.










