Jan 06,2023 21:59

ఫొటో : పొగాకు పంటను పరిశీలిస్తున్న పొగాకు కంపెనీల సి.టి.ఆర్‌.ఐ శాస్త్రవేత్తలు

పొగాకు పంట పరిశీలన
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని డిసిపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలోని పొగాకు పంటలను పొగాకు బోర్డు అధికారులు, పొగాకు కంపెనీల సి.టి.ఆర్‌.ఐ శాస్త్రవేత్తలతో కూడిన రైతు మిత్ర బృందం శుక్రవారం గుండెమడకల, డిసిపల్లి, బైరవరం, నందవరం గ్రామాల్లో సందర్శించారు. పొగాకు పంటలను క్యూరింగ్‌ను పరిశీలించి పొగాకు రైతులకు సూచనలు సలహాలిచ్చారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు రీజనల్‌ ఆఫీస్‌ ఆక్షన్‌ సూపరింటెండెంట్‌ సిద్దిరాజు మాట్లాడుతూ పొగాకులో సి.టి.ఆర్‌.ఐ. సిఫార్సు చేసిన మందులను తగిన మోతాదులో వాడాలని, పొగాకులో మందులను ఎక్కువగా వాడటంవలన పురుగు మందుల అవశేషాలు ఏవైనా డిమాండ్‌ తగ్గే అవకాశం ఉందని, లింగాకర్షక బుట్టలు, పసుపు జిగురు అట్టలు వాడడం, బంతి మొక్కలు వంటి ఎర పంటలను వేసుకోవాలని తెలియజేశారు.
పూర్తిగా పక్వానికి వచ్చిన లేత గోధుమ రంగు ఆకులనే రేలచాలని పచ్చి ఆకును నేలపై కాకుండా తార్పలిన్‌పై దించి అల్లాలని, పచ్చి అకులో గడ్డి, ఇతర అన్య పదార్థాలు లేకుండా శుభ్రత పాటించాలని తెలిపారు. బ్యారెన్‌లో ఇనుప జాలి అమర్చుకోవాలని, తప్పనిసరిగా క్యూ రోమీటర్‌ వాడాలని సూచించారు. కార్యక్రమంలో వేలం నిర్వహణ అధికారి జి.రాజశేఖర్‌, జి.వెంకట్రావు ఐటిసి మేనేజర్‌, ఏ.రామాంజనేయులు పి.ఎస్‌.ఎస్‌.మేనేజర్‌, యు.శ్రీనివాసులు జి.పి.ఐ మేనేజర్‌, జి ఆంజనేయులు మేనేజర్‌, పొగాకు బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.