Sep 25,2023 21:53

ఫొటో : మాట్లాడుతున్న పొగాకు బోర్డు రీజినల్‌ మేనేజర్‌ ఎం.లక్ష్మణ రావు

పొగాకు నియంత్రణపై అవగాహన
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని డిసిపల్లి పొగాకు బోర్డు పరిధిలోని టీ ముస్తాపురం, డిసిపల్లి, నెల్లూరుపాలెం గ్రామాలలో పొగాకు నారుమళ్లను పొగాకు బోర్డు రీజినల్‌ మేనేజర్‌ ఎం.లక్ష్మణ రావు పరిశీలించి రైతులకు తగు సూచనలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు పంట నియంత్రణ, ప్రత్యామ్నాయ పంటలు ఆవశ్యకత గూర్చి వివరించారు. పొగాకు బోర్డ్‌ అనుమతించిన విస్తీర్ణం బ్యారెన్‌కు 2.9 హెక్టార్లలో 3650 కిలోల మాత్రమే పండించాలని సూచించారు.
అధికంగా పొగాకు పంట పండిచడం వల్ల డిమాండ్‌ తగ్గి సరైన ధరలు ఉండకపోవడంతో నష్టాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పొగాకు మార్కెట్‌ ధరలు వివిధ దేశాలలో పొగాకు సాగు దిగుబడి నాణ్యత, అనేక అంతర్జాతీయ అంశాలు పొగాకు మార్కెట్‌ ధరలును ప్రభావితం చేస్తాయని తెలిపారు. పొగాకు విస్తరణను తగ్గించి దిగుబడి, నాణ్యతను పెంచుకొని అధిక లాభాలు పొందాలన్నారు. పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలన్నారు. బ్యారెన్‌లను అధిక ధరలుకు కౌలుకు తీసుకుని పొగాకు పంట వేయడం వల్ల నష్టాలు వస్తాయని పెట్టుబడలు తగ్గించుకోవాలని రైతులకు సూచించారు. పొగాకు బోర్డ్‌ అనుమతి లేకుండా కొత్త బ్యారెన్‌లు కట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి రైతులు పచ్చిరొట్ట ఎరువులను పెంచడం వల్ల మంచి దిగుబడి, నాణమైన పొగాకు పండించవచ్చన్నారు. రైతులు పొగాకు బ్యారెన్‌లు రెన్యూవల్‌ చేసుకొని ఎరువులు ఇండెంట్‌ ఇచ్చిన వారు తగిన ధ్రువీకరణ పత్రాలు బోర్డుకు అందజేసి ఎరువులు తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి జి.రాజశేఖర్‌, పొగాకు బోర్డ్‌ సిబ్బంది, ఐటిసి మేనేజర్‌ వెంకటేశ్వర రావు, రైతులు పాల్గొన్నారు.