ప్రజాశక్తి - చిలమత్తూరు : పొదుపు అంటే ఖర్చులు తగ్గించుకొని ఒక్కో రూపాయిని ఆదా చేసి జీవన నైపుణ్యాలను పెంచుకొని ఆర్థికంగా బలపడటం. ఈ లక్ష్యాలను అందుకోవడానికి ప్రభుత్వాలు పొదుపు సంఘాలు, డ్వాక్రా సంఘాలు, వెలుగు సంఘాలు, మహిళ స్వయం సహాయక సంఘాలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. పేరు ఏదైన లక్ష్యం పొదుపు చేయడమే. ఆర్థికంగా మహిళల అభ్యున్నతికి పెద్ద పీట వేయడంకోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు రుణాలను మంజూరు చేస్తుంది. అయితే కాయ కష్టం చేసి ఇలా ఆదా చేసుకున్న సొమ్మును వారి వివో(గ్రామసంఘం) అకౌంట్ లలో జమ చేస్తారు. వాటికి వచ్చే వడ్దీ సొమ్ము, ఆదాచేసిన సొమ్మును ఇతర సభ్యుల కష్టసుఖాలకు అందజేసి, ఆ సొమ్మును సకాలంలో చెల్లించేలా చూసుకుంటారు. ఇదంతా గతంలో మాట. ఇప్పుడు ఆ సంఘాలకు బ్యాంక్ హ్యాండ్‌లింగ్ చార్జస్ పేరుతో కొత్త కష్టం వచ్చి పడింది. వీరి సొమ్ముతో బ్యాంకులు తమ ఆదాయం పెంచుకుంటున్నాయన్న విమర్శలు వినపడుతున్నాయి. దీంతో మహిళాసంఘాల పొదుపు నీటిమీద రాతగా మారిందన్న వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి.
మహిళ స్వయం సహాయక సంఘాలకు ఇప్పుడు వచ్చే వడ్డీ, ఆదా కథ దేవుడెరుగు డిపాజిట్ చేసిన డబ్బు కూడా పూర్తిగా జమాకాకుండ కమీషన్ పేరుతో కోత కోస్తున్నారని సభ్యులు లబోదిబోమంటున్నారు. ఇది కేవలం చిలమత్తూరు మండలానికే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితులు ఉన్నాయంటున్నారు కెనరా బ్యాంక్ నిర్వాహకులు. బ్యాంక్ నిబందనలలో వచ్చిన మార్పుల వల్ల ఇలా అవుతుందని వారు అంటున్నారు.
డిపాజిట్ లలో కోత ఇలా...
కెనరా బ్యాంక్ నిబందనల ప్రకారం నెలలో 3 సార్లు డిపాజిట్ చేసుకోవచ్చు. అది దాటితే ఇక కోతే. సాధారణంఆ ఒక్కో వివో క్రింద15- 40 వరకు చిన్న సంఘాలు ఉంటాయి. గ్రామ సంఘం పొదుపు, శ్రీ నిధి, సిఐఎప్ అప్పులు నెల వారీగా ఒక్కో సంఘం ఒక్కో రోజు చెల్లిస్తుంటుంది. సమస్య ఇక్కడే మొదలవుతోంది. అన్ని డబ్బులు మూడు సార్లు లోపే బ్యాంకుకు చేయడం సాధ్యపడదు. మహిళ స్వయం సహయక సంఘాల సభ్యుల ఆర్థిక పరిస్థితిని బట్టి వారి దగ్గర డబ్బుకు ఉన్నప్పుడు బ్యాంక్‌లలో వివో అకౌంట్‌కు జమ చేస్తారు. ఇలా జమా చేయడం ఎంత తక్కువ అనుకున్నా నెలలో పది సార్లకు పైబడే ఉంటుంది. మూడుసార్లు దాటితో నిబందనల ప్రకారం ప్రతి డిపాజిట్‌కు రూ. 59 నుండి రూ.295 వరకు కట్ అవుతుందని అదికూడా డిపాజిట్ అమౌంట్ విలువని బట్టి కట్ అవుతుందని మహిళాసంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కమీషన్ పేరుతో ....
నెలలో మూడు సార్లు డిపాజిట్ దాటితే ఇక కోతే. పొదుపు సంఘాల వారు 100 రూపాయల నుండి పొదుపు డిపాజిట్ చేసేవారు ఉంటారు. తాము డిపాజిట్ చేసిన సొమ్ము సక్రమంగా అకౌంట్‌లో జమ అయిందనుకుంటారు. అయితే అందులో కూడా రూ. 59 కట్ అవుతుందని తెలిసిన మహిళాసంఘాల సభ్యులు అవాక్కవుతున్నారు. దీనిపై వారు ఎపిఒకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎపిఒ బ్యాంకు మేనేజరుతో మాట్లాడి లెటర్‌కూడా ఇచ్చారు. అయినా ప్రయోజనం లేదని తాము బ్యాంకు నిబంధనలు పాటిస్తున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు.
ఒక్క క్లస్టర్‌లో కమిషన్ పేరుతో నగదు కోత పడిన వివరాలు...
అదికారుల లెక్కల ప్రకారం 2021-22లో చౌడేశ్వరి సంఘానికి చెందిన రెండు అకౌంట్ల నుండి రూ. 10738లు కమీషన్ పేరుతో కట్ అయింది. ఇక అల్లా మాలిక్ సంఘం నుండి రూ. 8673, అన్నపూర్ణేశ్వరి సంఘం నుండి రూ.11795, శ్రీ శక్తి సంఘం నుంచి రూ. 10660, ఈశ్వరి సంఘం నుంచి రూ. 1240, శ్రీ లక్ష్మి సంఘం నుంచి రూ. 9026, విజేత సంఘం రూ. 767 కట్ అయ్యాయి. ఇవన్ని ఒక్క క్లస్టర్ లోనివి(వివో)మాత్రమే. కేవలం ఒక్క సంవత్సరంలో 52,899 రూపాయలు కట్ అయ్యాయి. ఈ తరహాలోనే 2022-23 లో మరింత పెరిగింది. ఇలాంటివి మండలంలో 3 కస్టర్లు ఈ కెనరా బ్యాంక్ పరిధిలో ఉన్నాయి, ఈ లెక్కన 27 గ్రామ సంఘాలు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇలా అన్ని సంఘాలు చూస్తే లక్షల రూపాయలలో కమీషన్ కట్ అవుతున్నట్లు తెలుస్తోంది. పొదుపు కాదు కదా బ్యాంకర్ల నిర్వాహకంతో తమ అప్పు కూడా తీరడం లేదని మహిళలు వాపోతున్నారు. ఇలా కమీషన్ పేరుతో పొదుపు సొమ్మునుంచి నగదు కట్ కావటంతో సంఘం నిర్వహణలోని లావాదేవీల్లో తేడాలు కన్పించి సంఘ సభ్యుల మధ్య సమస్యలు నెలకొంటున్నాయి. ఈనేపథ్యంలో సభ్యులపై భారం పెరుగుతు మహిళ స్వయం సహాయక సంఘాల నిర్వహణ కష్టతరంగా మారుతున్న పరిస్థితి నెలకొంది.
సంఘాల నిర్వహణ కష్టంగా ఉంది
మహిళా స్వయం సహయక సంఘాల నిర్వహణ కష్టం అవుతుంది. ప్రభుత్వం వైపు నుండి ప్రోత్సాహం ఉన్న కెనరా బ్యాంక్‌లో ఉన్న వీవో ఖాతాలో జమ చేసే సొమ్ము బ్యాంక్ హ్యాండలింగ్ చార్జస్ పేరుతో కట్ చేస్తుండటంతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. చిన్న సంఘాల పొదుపు పోయి అప్పులు మిగులుతున్నాయి. దీంతో చాల సమస్యలు ఏర్పడుతున్నాయి. సమస్యను మేనేజర్‌కు విన్నవించాము. వారు బ్యాంక్ నిబందనలు అలా ఉన్నాయంటున్నారు. ఇలా అయితే సంఘాలు నడవడం కష్టం. ప్రభుత్వం చొరవ తీసుకొని మహిళ స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ నిబందనల్లో మినహాయింపు ఇవ్వాలి.
భారతి ,
ఎపిఎం










