మాట్లాడుతున్న కమిషనర్ హరిత
పన్నుల లక్ష్యాలను అధిగమించాలి
నెల్లూరు:నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయ కార్యదర్శులు తమకు నిర్దేశించిన పన్నుల వసూళ్ల లక్ష్యాలను అందుకోవాలని కమిషనర్ హరిత సూచించారు. స్థానిక 38/1 అక్కన్న వారి వీధి వార్డు సచివాలయాన్ని కమిషనర్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని వివిధ రికార్డులను పరిశీలించారు. ఆస్థి పన్ను, యూజర్ చార్జీల వసూళ్ళను సచివాలయ కార్యదర్శులు మరింత వేగవంతం చేయాలని సూచించారు. సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. జగనన్న భూ హక్కు పధకంలో భాగంగా రీ సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. సచివాలయం పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, రానున్న వేసవి నీటి ఎద్దడిని దష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలిగేలా నిరంతరం పర్యవేక్షించాలని, రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చేందుకు అవసరమైన నివేదికలను రూపొందించాలని, రోడ్లను ఆక్రమిస్తూ నిర్మిస్తున్న భవన నిర్మాణ సామాగ్రి తొలగింపునకు నోటీసులు అందివ్వాలని ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ ధరించాలని కమిషనర్ ఆదేశించారు.










