Jul 05,2022 23:47

  • ఇంటింటికీ సిపిఎం బృందానికి ప్రజలు మొర

ప్రజాశక్తి-విజయవాడ: పన్నుల భారాలు మోయలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికీ సిపిఎం కార్యక్రమం 29వ డివిజన్‌ మధురానగర్‌ పప్పుల మిల్లు సెంటర్‌, కాల్వగట్టు రోడ్డు తదితర ప్రాంతాల్లో మంగళవారం జరిగింది. పనులు లేక, ధరలు పెరిగి కుటుంబాలు గడవటం కూడా కష్టంగా ఉందని వాపోయారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 11న కలెక్టర్‌కు వినతిపత్రాలను అందజేసే కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం ప్రజలను తీవ్ర మోసం చేసిందన్నారు. కుటుంబాలు గడవటమే కష్టంగా ఉంటే రూ.35 వేలు ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు వరకు ఉచితంగానే ఇళ్లు నిర్మించి ఇస్తామని, టిడ్కో గృహాలను పంపిణీ చేస్తామని ప్రజలకు వాగ్ధానం చేసిఅధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయినా నేటికీ అతీగతీ లేకుండా పోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి బి.రమణరావు, కార్యదర్శివర్గ సభ్యులు కె.దుర్గారావు, టి ప్రవీణ్‌, నాయకులు పి.కృష్ణమూర్తి, వై.కృష్ణయ్య, వై చిన్న, బి రాము, వై మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-జగ్గయ్యపేట టౌన్‌: విద్యానగర్‌ ధనంబోడు కాలనీలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్‌.సిహెచ్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు ధనంబోడులో మంచినీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని, కాలనీలో పిల్లలు చదివేందుకు స్కూల్‌ లేదని, దీంతో తొరగుంటపాలెం స్కూల్‌కు పంపుతున్నామని, ఆటో ఛార్జీలు భారంగా మారాయని, వెంటనే తమకు స్కూల్‌ నిర్మాణం చేయాలని, రాంకో సిమెంట్‌ ఫ్యాక్టరీ నుండి వచ్చే వాయు కాలుష్యంతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోమోజు నాగమణి, కోట రవి, ఎస్‌కె మీరా, డి.భాస్కర్‌ పాల్గొన్నారు. ప్రజాశక్తి-నందిగామ: స్థానిక డివిఆర్‌ కాలనీ 18వ వార్డులో సిపిఎం నాయకులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కటారపు గోపాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 500 మందికిపైగా విద్యార్థులు పాఠశాల లేక నందిగామ రావటంతో అనేక వ్యయప్రయాసలకు గురౌతున్నారని తెలిపారు. శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని కోరారు. అంతర్గత రహదారులు, సిసిరోడ్లు, డ్రైయినేజిలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సయ్యద్‌ ఖాసిం, గోపినాయక్‌, ఉప్పు శ్రీను, రోశయ్య, పుల్లయ్య, బత్తుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-ఎ.కొండూరు: ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో కంభంపాడు, చీమలపాడు గ్రామాల్లో ప్రజల నుండి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆయా గ్రామాల సచివాలయాలు ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, నాయకులు పానెం ఆనందరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేసి రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం వారికి డబ్బులు చెల్లించకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. కంభంపాడు గ్రామంలో డ్రైనేజీ సమస్య, ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య, అంతర్గత రోడ్ల సమస్యలు ఉన్నాయన్నారు. గుర్తింపు కార్డులను మంజూరు చేయకపోవడం వల్ల కౌలు రైతులు తాము పండించిన పంటల వివరాలు ఈ క్రాప్‌ చేయించుకోలేకపోయారని, దీనితో వారికి నష్టపరిహారం అందలేదని అన్నారు. ధర్నా అనంతరం వినతిపత్రాలను కంభంపాడు, చీమలపాడు గ్రామాల సచివాలయ కార్యదర్శులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంభంపాడు గ్రామ సిపిఎం కార్యదర్శి ఆర్‌.రామకృష్ణ, నాయకులు పి.చిన్న దుర్గారావు, రాము, నరసింహారావు, సీతారావమ్మ, లక్ష్మీ, ఉదరు, ఎస్‌.మోహన్‌రావు, ఎస్‌.సోములు, ఎం.స్వరాజ్యం, ఎం.సుమలత, బి.బాలస్వామి, పి.దావీదు, ఎం.వెంకటేశ్వరరావు, ఎం.కొండయ్య తదితరులు పాల్గొన్నారు.