Mar 06,2023 20:53

మాట్లాడుతున్న కమిషనర్‌ హరిత


మాట్లాడుతున్న కమిషనర్‌ హరిత
పన్ను వసూళ్ల లక్ష్యాలను అధిగమించాలి
నెల్లూరు :నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి, కుళాయి, డ్రైను, ఖాళీ స్థలం, వాణిజ్య ప్రకటనల పన్నులతో పాటు ప్రతి ఇంటి నుంచి యూజర్‌ చార్జిల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు కమిషనర్‌ హరిత ఆదేశించారు. నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులతో కార్యాలయంలోని సమావేశ మందిరంలో కమిషనర్‌ సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నగర పాలక సంస్థ ద్వారా అందిస్తున్న వివిధ సేవలను నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేయాలని కమిషనర్‌ సూచించారు. నగర పాలక సంస్థ జారీ చేసే ట్రేడ్‌ లైసెన్స్‌ ల ఆవశ్యకతపై వ్యాపార వర్గాలకు అవగాహన పెంచి, నగర వ్యాప్తంగా అన్ని షాపులను లైసెన్సుల పరిధిలోకి తేవాలని శానిటేషన్‌ విభాగం అధికారులను ఆదేశించారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో (క్లాప్‌) భాగంగా ప్రతీ ఇంటినుంచి ప్రణాళికాబద్ధంగా చెత్తను సేకరించాలని, యూజర్‌ చార్జీల వసూళ్లపై ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు.
సచివాలయాల వారీగా పన్నుల లక్ష్యాలను నిర్దేశించి, వసూళ్లను వేగవంతం చేయాలన్నారు.వివిధ యాడ్‌ ఏజెన్సీల పన్నుల బకాయిలను ప్రణాళికాబద్ధంగా వసూలు చేసి కార్పొరేషన్‌ ఆదాయాన్ని పెంచేందుకు కషి చేయాలని అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. వాణిజ్య ప్రకటనల ప్రదర్శనలకు నగర పాలక సంస్థ సూచించిన మార్గదర్శకాలను యాడ్‌ ఏజెన్సీలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలని సూచించారు. భారీ హౌర్డింగ్స్‌ ఏర్పాటులో నాణ్యతా ప్రమాణాలను యాడ్‌ ఏజెన్సీలు కచ్చితంగా పాటించేలా జాగ్రత్తలు వహిస్తూ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రకటనలు ఏర్పాటు చేసుకునేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్‌ సూచించారు.సచివాలయ అడ్మిన్‌, వి.ఆర్‌.ఓ, ప్లానింగ్‌ కార్యదర్శులను సమన్వయం చేసి రీ సర్వే పనులను వేగవంతం చేయాలని, సర్వేలో అన్ని వివరాలను సమగ్రంగా పొందుపరచాలని ఆదేశించారు. సచివాలయాల వారీగా రీ సర్వే పనులను పూర్తి చేసి, రికార్డులను పదిలపరచాలని కమిషనర్‌ సూచించారు.అన్ని డివిజనుల్లో వీధి కుక్కల నియంత్రణకై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, కుక్కలపై ఫిర్యాదులను 9553219996 నెంబరుకు వాట్సాప్‌ ద్వారా తెలియజేయాలని ప్రజలకు సూచించారు.పన్ను వసూళ్ళలో సచివాలయ కార్యదర్శులకు వారాంతపు లక్ష్యాలను నిర్దేశించాలని, లక్ష్యాలు పూర్తి చేయనివారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని సూచించారు. అధికారులంతా కార్పొరేషన్‌ ఆదాయం పెంచేందుకు కషి చేయాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ చెన్నుడు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.