పనిగంటలు రీషెడ్యూల్ చేయండి: సిఐటియు
ప్రజాశక్తి- శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో పరిధిలో పనిచేస్తున్న డ్రైవర్ల పనిగంటలను రీషెడ్యూల్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం డిమాండ్ చేశారు. యాజమాన్యం ఒత్తిళ్లు, పనిభారం వల్ల డ్రైవర్లు శారీరకంగా, మానసికంగానూ అలిసిపోతూ హఠాత్మరణాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న నిరంకుశ తీరుకు వ్యతిరేకంగా సీఐటీయూ నాయకలు శనివారం స్థానిక ఆర్టీసీ డిపో గ్యారేజీ వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆర్టీస్టీ డిపోలో సరైన పనివిధానం అమల్లో లేదన్నారు. డ్రైవర్ల కొరత కారణంగా పనిభారం ఎక్కువవుతుందని వాపోయారు. యాజమాన్యం ఒత్తిళ్లు, పనిభారం కారణంగా డ్రైవర్లు బీపీ, షుగర్ వ్యాధుల భారినపడుతూ గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు వచ్చి మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లు ధనరాజ్, రాంబాబు మరణం ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలని చెప్పారు. ఉదాహరణకు శ్రీకాళహస్తి- తిరుపతి మార్గంలో పాత పనిగంటలు, పాత కిలోమీటర్లనే లెక్కిస్తున్నారని, అధికారులు సర్వే చేసి రీషెడ్యూల్ చేయాలని సూచించారు. సాధారణ సెలవులే కాకుండా అత్యవసర సెలవులు సైతం మంజూరు చేసి డ్రైవర్లపై మానసిక ఒత్తిడి తగ్గించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏ బిల్లుల చెల్లింపుకు చొరవ చూపాలన్నారు. మరణించిన డ్రైవర్ల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇకనైనా శ్రీకాళహస్తి ఆర్డీసీ డిపో యాజమాన్యం తీరుమారకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం పట్టణంలో ఇటీవల మృతి చెందిన డ్రైవర్ రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి ఆయన కుటుంబానికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య, గంధం మణి, తదితరులు పాల్గొన్నారు.
్ర










