పంటపొలాల్లో సోమిరెడ్డి పరిశీలన
ప్రజాశక్తి-సంగం : మండలంలోని తరుణవాయి గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను మంగళవారం మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. పంట నష్టం వివరాల గురించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అకాల వర్షాలకు లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో 6వేల ఎకరాల పైన వరి, 1000 ఎకరాల శెనగ, పత్తి దెబ్బతిందన్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు కచ్చితమైన నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు, ప్రస్తుతం జిల్లాలో ఉన్న వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏనాడైనా రైతులను పరామర్శించారా అని ప్రశ్నించారు. గతంలో కరువచ్చినా కృష్ణా జలాలు తీసుకొచ్చి మరీ ఎకరానికి నాలుగున్నర పుట్లు పండించిన ఘనత టిడిపి ప్రభుత్వానిది అని అన్నారు. వరి కోతలు ప్రారంభమైన ప్రభుత్వం ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారుల ఇష్టారాజ్యం అయిపోయిందని మండిపడ్డారు. కార్యక్రమంలో టిడిపి మాజీ జిల్లా కార్యదర్శి బాణా శ్రీనివాసులు రెడ్డి, రైతులు పాల్గొన్నారు.










