ప్రజాశక్తి రొద్దం : వర్షాలకు పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే పార్థసారధి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మండలంలోని పలు గ్రామాలలో వర్షాలకు నష్టపోయినా పంటలను పరిశీలించారు. ఆర్. మరవపల్లి చెందిన గుడిసె రామాంజి తను ఎనిమిది ఎకరాలలో వేసిన కంది పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు తనకు జరిగిన నష్టాన్ని వివరించారు. ఎకరాకు పదివేల రూపాయల చొప్పున పెట్టుబడికి ఖర్చు చేశానని అయితే వర్షాల కారణంతో పూత దశలోనే పూత రాలిపోయిందని,ఉన్న కొద్దిపాటి కాయలు కూడా ఈ వారం రోజుల్లో కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతినిందని వాపోయారు. తనకు పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొందని వాపోయారు. అదేవిధంగా రొద్దకంపల్లి గ్రామానికి చెందిన నరసింహప్ప అనే రైతు మాట్లాడుతూ తన 2ఎకరాల పొలంలో ప్రభుత్వం అందించిన కంది విత్తనాలు కొనుగోలు చేసి పంటసాగు చేశానని అయితేపక్క పొలంవారు వారు ప్రయివేట్ వ్యక్తులతో కొనుగోలు చేసిన విత్తనాలు సాగు చేశారన్నారు. ప్రభుత్వం అందించిన నకిలీ, నాశిరకమైన విత్తనాలతో పంటను పూర్తిగా నష్టపోయాయని బాధితుడు వాపోయాడు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. అధికారులు, నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని లేకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా మండలంలోని ఎల్ జి బి నగర్ వద్ద రైతు సాగు చేసిన మొక్కజొన్న పంటను రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవిత పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి సత్యసాయి జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, పెనుగొండ నియోజకవర్గం అధ్యక్షులు చిన్నప్పయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి నరసింహులు, మండల కన్వీనర్ నరహరి, హరీష్, ఎం.కొత్తపల్లి సర్పంచి నాగరాజు, వీరాంజి, మురళి, రద్దకంపల్లి నాగరాజు, వేణుగోపాల్, క్రిష్టప్ప, ప్రభాకర్, క్రిష్ట, రాము,అక్బర్ తదితరులు పాల్గొన్నారు.










