పుట్టపర్తి అర్బన్ : మాండూస్ తుపాను నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన, వివిధ రకాల పంటలను గుర్తించాలని జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ రమణారెడ్డి, కలెక్టర్ బసంత్‌కుమార్ అధికారులకు సూచించారు. పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నాడు జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ ఛైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ మాండూస్ తుపాను నేపథ్యంలో జిల్లాలో ఎక్కడెక్కడ పంటలు నష్టపోయాయో గుర్తించాలని, నష్టపోయిన పంటలకు పరిహారం వచ్చేలా వివరాలను త్వరితగతిన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. మాండూస్ తుపాను వల్ల అధిక వర్షాలకు వరి, పత్తి, టమోటా తదితర రకాల పంటలు దెబ్బతిన్నాయని, వాటిని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేసి పూర్తి వివరాలతో రైతు భరోసా కేంద్రాల్లో సోషల్ ఆడిట్ జాబితా పెట్టి అంచనాలను సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో దెబ్బతిన్న పంటల వివరాలు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఆర్‌బికె మిత్రలు అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల వల్ల పంటలు నష్టపోయిన మొక్కజొన్న, దానిమ్మ పంటలకు కూడా ఇన్సూరెన్స్ అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ బసంత్ కుమార్ మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన సేవలను రైతులకు అందించేలా చూడాలన్నారు. అనంతరం మామిడి సాగుపై తోటబడి కరదీపికను విడుదల చేశారు. పశుసంవర్ధక శాఖ డిడి సుబ్రహ్మణ్యంకు అనంతపురం పశుసంవర్ధక శాఖ శాఖ జేడిగా పదోన్నతి లభించడంపై కలెక్టర్ ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సుబ్రహ్మణ్యం, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, సిరికల్చర్ జెడి పద్మమ్మ, అగ్రికల్చర్ ట్రేడ్, మార్కెటింగ్ అధికారి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.










