చంఢఘీర్ : పంజాబ్ అసెంబ్లీ, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మూడో దశ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిసాయి. పంజాబ్‌లోని మొత్తం 117 స్థానాలకు ఆదివారం ఒకే దశలో ఎన్నికలు జరగ్గా, ఉత్తరప్రదేశ్‌లో 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. పంజాబ్‌లో 64.3 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 60.1 శాతం ఓటింగ్ నమోదయింది. పంజాబ్‌లో మొత్తం 1304 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఛామ్‌కౌర్ సాహిబ్, భదౌర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. అమృత్‌సర్ నుంచి పిసిసి అధ్యక్షుడు నవజోత్‌సింగ్ సిద్ధూ, ఆప్ సిఎం అభ్యర్థి భగవంత్ మాన్ దురీ నుంచి, శిరోమణి అకాళీదళ్ నుంచి సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ జలాలాబాద్ నుంచి, ప్రకాష్‌సింగ్ బాదల్ లాంబీ నుంచి బరిలో ఉన్నారు. ఖరార్‌లో చన్నీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని చన్నీ నమ్మకం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ వ్యవస్థాపకులు అమరీందర్ సింగ్ పటియాలాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మన్ మొహాలీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆప్‌ను ఓడించడానికి కాంగ్రెస్, బిజెపి చేతులు కలిపాయని విమర్శించారు.
ఉత్తరప్రదేశ్‌లో మూడో దశలో భాగంగా 16 జిల్లాలోని 59 స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. 627 మంది అభ్యర్థులు పోటీ పడగా, 2.15 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీచేస్తున్న కర్హాల్‌లోనూ ఎన్నికలు జరిగాయి. సైఫైలో అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్‌పి వ్యవస్థాపకులు ములాయంసింగ్ యాదవ్ జశ్వంత్‌పురలో పోలింగ్ కేంద్రానికి వీల్ చైర్‌పై వచ్చి ఓటు వేశారు. రాష్ట్రంలో మొత్తం 403 స్థానాలకు గాను 172 స్థానాలకు పోలింగ్ పూర్తయింది.










