Jul 12,2021 21:08

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పంజాబ్‌ నుంచి డజన్ల కొద్దీ రైతు ర్యాలీలు ఢిల్లీకి పయణమయ్యాయి. ఈ నెల 22 నుంచి పార్లమెంట్‌ వద్ద జరిగే ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు వేలాది మంది రైతులు ఢిల్లీకి బయలుదేరారు. మహిళా రైతులతో సహా రైతుల కాన్వారులు పంజాబ్‌ నుంచి ఢిల్లీకి బయలు దేరినట్లు పంజాబ్‌ రైతు సంఘాలు ప్రకటించాయి. లూధియానా, సంగ్రూర్‌, మాన్సా, బతిండా, బర్నాలా, రోపర్‌, ఫాజిల్కా, ఫరీద్కోట్‌ సహా వివిధ జిల్లాల నుండి డజన్ల కొద్దీ రైతులు, కూలీలుమార్చ్‌లు సింఘూ, టిక్రీ సరిహద్దులకు ఇప్పటికే బయలుదేరాయి.
టోల్‌ ప్లాజాలు, రిలయన్స్‌ పంపులు, కార్పొరేట్‌ మాల్స్‌, రైల్వే పార్కులు, అదానీ ఓడరేవు, బిజెపి నాయకుల ఇళ్లతో సహా 108 ప్రదేశాల్లో పంజాబ్‌ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో అమరవీరులైన రైతులు, కూలీల మరణాలకు కారణమైన మోడీ ప్రభుత్వంపై హత్య కేసు నమోదు చేయాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు.
హర్యానాలోని సిర్సా వద్ద ఆందోళన చేసినందుకు అదుపులోకి తీసుకున్న రైతులను వెంటనే విడుదల చేయాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలిపే రైతులను అరెస్టు చేయడం రైతుల సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయడంలో భాగమేనని ఎస్‌కెఎం నేతలు విమర్శించారు.