హిందూపురం : ప్రయివేటు విద్యాసంస్థలు పండుగ పూట కూడా విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా ప్రత్యేక తరగతుల పేరుతో వేధిస్తున్నారు. కళాశాలలకు పేరు రావాలని, విద్యార్థులను చదువుల యంత్రాలుగా మారుస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని నారాయణ కళాశాలలో తెలుగువారి ప్రధాన పండుగ ఉగాది రోజున కూడా బుధవారం సెలవివ్వకుండా తరగతులు నిర్వహంచారు. ఈ విషయం ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులకు తెలిసినా వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.
విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటి నుంచి ఒక్క రోజు కూడా సెలవులు ఇవ్వకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను చదువుల పేరుతో వేధిస్తున్నాయి. ప్రభుత్వం రెండవ శనివారం, ఆదివారంతో పాటు ప్రభుత్వ సెలవు రోజుల్లో కళాశాలలను నిర్వహించరాదని నిబంధన విధిస్తున్నా యాజమాన్యాలు వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన సమయాలను పక్కనపెట్టి సమయపాలన పాటించకుండా తరగతులను నిర్వహిస్తున్నారు. ఇలా విద్యార్థులను చదువుల పేరుతో మానసికంగా వేధిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి సమైక్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. బుధవారం నాడు హిందూపురంలో నారాయణ కళాశాల వద్ద కూడా నిరసన తెలిపారు. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులకు సైతం తెలియజేశారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఇచ్చే ముడుపుల మత్తులో అధికారులు చూసీచూడనట్లు వ్యవహిరస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి పండుగుల పూట కూడా సెలవులు ఇవ్వకుండా మార్కుల వేటలో విద్యార్థులను వేధిస్తున్న ప్రయివేటు, కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
విద్యార్థులను యంత్రాల్లో మార్చేస్తున్నారు..
బాబావలి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి.
కార్పొరేట్, ప్రయివేటు విద్యాసంస్థలు వారి స్వార్ధం కోసం విద్యార్థులను చదువుల యాంత్రాలుగా మారుస్తున్నారు. ప్రభుత్వ సెలవు రోజులతో పాటు పండుగపూట తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ విషయాలను అన్ని ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇలాగే సెలవు రోజుల్లో కూడా తరగతులను నిర్వహిస్తే సంబంధిత విద్యాసంస్థలపై ప్రత్యక్ష దాడులు నిర్వహిస్తాం.










