Mar 28,2021 12:26

ఓసారి అడవిలో పండ్లన్నీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమావేశంలో తమలో ఒకరిని రాజుగా ఎన్నుకోవాలని తీర్మానం చేసుకున్నాయి. దాంతో రాజుగా తననే ఎందుకు ఎన్నుకోవాలో వివరిస్తూ ప్రతి పండూ తన గొప్పలు చెప్పుకోసాగింది.
'సృష్టిలో నా అంత తీయనైన పండు మరొకటి లేదు. కాబట్టి నేనే రాజుగా ఉండదగినదాన్ని' అని చెప్పింది మామిడిపండు మొదటగా.
'నువ్వు నా కంటే తియ్యగా ఉంటే ఉండవచ్చుగానీ నా రుచి ముందు నీ రుచి బలాదూర్‌. కాబట్టి నేనే రాజుగా ఉండదగినదాన్ని' అంది సీతాఫలం.
'నన్ను తింటే అందరూ ఆరోగ్యంగా ఉంటారట. కాబట్టి నేనే మీ అందరికీ రాజుగా ఉంటాను' అంది బొప్పాయి పండు.
'నేను మాత్రం తక్కువా? నేనెంతో రుచిగా ఉంటానని చిన్నా, పెద్దా అందరూ అంటారు. కాబట్టి నేనే రాజుగా ఉండాలి' అని పేచీ పెట్టింది జామపండు.
'మీరెవరూ కాదు. రాజుగా ఉండడానికి కావాల్సిన అర్హతలన్నీ నాకే ఉన్నాయి. నన్ను తింటే వైద్యుడి అవసరం ఉండనే ఉండదట. కనుక నన్నే రాజుగా ఎన్నుకోవాలి' అన్నది ఆపిల్‌పండు ఎర్రగా మెరుస్తూ. ఇలా ద్రాక్ష, అరటి, సపోటా, నేరేడు పండ్లన్నీ తననే రాజుగా ఎన్నుకోవాలని చెప్పాయి. చివరగా పనసపండు కూడా ఆయాస పడుతూ 'అసలు మీలో ఎవరికీ రాజుగా ఉండే అర్హత లేదు. రాజుగా ఉండడానికి అవసరమైన అర్హతలన్నీ ఉన్నది నాకే' అనేసరికి మిగతా పండ్ల్లన్నీ పగలబడి నవ్వడం మొదలెట్టాయి.
'ఏముంది నీలో? ఓ అందమా, చందమా?! ఒళ్ళంతా ముళ్ళు, లోపలంతా పీచు, జిగురు. పైగా విపరీతమైన లావుగా, బద్ధకంగా ఉంటావు. నువ్వెలా రాజుగా ఉండగలవు?' అంటూ ఎగతాళి చేశాయి మిగతా పండ్లన్నీ.
చివరికి తామంతా పరుగు పందెం పెట్టుకుని, ఎవరు గెలిస్తే వారిని రాజుగా ఎన్నుకోవాలి అనుకున్నాయి.
పనసపండూ పరుగు పందేనికి తయారవ్వడం చూసి. మిగతా పండ్లన్నీ నవ్వుకున్నాయి. కానీ పనసపండు అవేమీ పట్టించుకోలేదు.
మామిడిచెట్టు కింద నుంచి మైలు దూరంలో ఉన్న సపోటా చెట్టు వరకూ ఎవరు పరుగెత్తి ముందుగా చేరుకుంటారో వారే 'రాజు' అని తీర్మానించాయి. 'ఒకటి ... రెండు ... మూడు ...' చెప్పుకుని పరుగు పందెం ప్రారంభించాయి పండ్లన్నీ. పది అడుగులు పరిగెత్తేసరికి ద్రాక్షపండు చితికిపోయి, అక్కడే ఆగిపోయింది.
వంద అడుగుల తరువాత సపోటాపండూ చితికిపోయి, గింజలు బయటకు వచ్చి అక్కడితో పందెం విరమించుకుంది.
నూట యాభై అడుగుల వరకూ దొర్లుకుంటూ పరుగెత్తిన సీతాఫలం పగిలిపోయి, ఇంకొక్క అడుగు ముందుకు వెయ్యలేక అక్కడే ఆగిపోయింది.
రెండొందల అడుగుల తరువాత ఆపిల్‌పండు రాళ్లు గుచ్చుకుని, ముక్కలు ముక్కలై అక్కడే కూలబడిపోయింది.
మూడొందల అడుగులు పరిగెత్తిన తరువాత మామిడిపండు ముళ్ళ పొదలకు తగులుకుని చర్మం చీరుకుపోయి, రసం కారిపోయి, టెంక బయటపడి పరుగు పందేనికి స్వస్తి పలికింది. ఇలా అరమైలు కూడా దాటకుండానే బొప్పాయి, జామ, కమలా, అరటి అన్నీ నలిగిపోయి, అడుగు ముందుకు వెయ్యలేక ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
చివరికి పనసపండు మాత్రం చెక్కు చెదరకుండా మైలుదూరం ఏకబిగిన పరుగెత్తి, గమ్యం చేరుకుంది. ధీంతో పరుగు పందెంలో విజయం సాధించిన పనసపండునే తమకు రాజుగా ఎన్నుకున్నాయి మిగతా పండ్లన్నీ. పైగా అంతకుముందు పనస పండును ఎగతాళి చేసినందుకు సిగ్గు పడిపోయి, క్షమాపణా వేడుకున్నాయి. ఆ తరువాత చాలాకాలం వరకూ పనసపండు ఆ పండ్లన్నింటికీ రాజుగా వ్యవహరించి, పరిపాలన కొనసాగించింది.
                        * కోనే నాగ వెంకట ఆంజనేయులు, 9290660220