ప్రజాశక్తి-వాల్మీకిపురం : మండలంలోని అన్ని పంచాయతీల్లో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సంపదను సృష్టించాలని అన్నమయ్య జిల్లా డిపిఒ ధనలక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని అయ్యవారిపల్లి, జర్రావారిపల్లి పంచాయతీల్లో పర్యటించి, చెత్త సంపద కేంద్రాలను పరిశీలించారు. అనంతరం జర్రావారిపల్లి సచివాలయాన్ని తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాద పూర్వకంగా నడుచుకుంటూ, వారికి అవసరమైన సేవలు అందించాలన్నారు. గ్రామాలు పచ్చధనం పరిశుబ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చెత్త సంపదను సృష్టించడం వలన పంచాయతీలు అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ షబ్బీర్ అహ్మద్, ఇఒపిఆర్‌డి శకుంతల, పంచాయతీ సెక్రటరీ అశ్వని, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










