ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి
గ్రామ స్వరాజ్యం కోసం పనిచేస్తోన్న పంచాయతీలను నిర్వీర్యం చేసేందుకు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో సంగం డెయిరీ చైర్మన్ దూళిపాళ్ల నరేంద్రను మంగళవారం మధ్యాహ్నం ఆయన పరామర్శించారు. సంగం డెయిరీలో అవినీతి, అక్రమాలపై నరేంద్రతో పాటు పలువురిని ఎసిబి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌పై స్వగ్రామానికి కొద్ది రోజుల క్రితం వచ్చిన నరేంద్రను పరామర్శిచేందుకు చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్వవస్థను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ కుట్ర చేస్తోందని విమర్శించారు. పంచాయతీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం సర్పంచులు ఐక్యంగా పోరాడాలని కోరారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వైసిపి నేతలు ప్రజల దృష్టిని మరల్చేందుకు టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడు, దూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర వంటి నేతల విషయంలో రాజకీయ కక్ష సాధింపునకే వైఎస్ జగన్ అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వైసిపి నేతలను భవిష్యత్తులో తాము వదిలిపెట్టబోమని, ఇంతకు అంత చెల్లిస్తామని అన్నారు. రాష్ట్రంలో వైసిపి నేతలు చేస్తున్న అవినీతి, అక్రమాలపై విచారణకు దేశంలో ఉన్న కోర్టులు సరిపోవని వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన గుంటూరు చేరుకున్నారు. ఇటీవల మృతి చెందిన మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం.డి.హిదాయత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.










