ఉగాది వచ్చిందంటే పంచాంగాల హోరు మొదలౌతుంది. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం వానలు ఎక్కువ. చలికాలం చలి ఎక్కువగా ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి 'మరలా మీరు అధికారంలోకి వస్తారు'. ప్రతిపక్షం లోనివారికి 'ఈసారి మీదే విజయం...'అని చెప్పి వచ్చినంత గుంజుకోవటమే పంచాంగం చెప్పేవారి లక్ష్యం.
పంచాంగానికి మూలం గ్రహాలు, నక్షత్రాలు, రాశులు. గ్రహాలు అంటే ఏమిటో, నక్షత్రాలు అంటే ఏమిటో, ఉపగ్రహాలు అంటే ఏమిటో ఈ పంచాంగాలు చెప్పేవారికి తెలియదు. వారికి తొమ్మిది గ్రహాలు అని మాత్రమే తెలుసు. వాటిలో సూర్యుడు నక్షత్రమని, చంద్రుడు భూమికి ఉపగ్రహమనీ, రాహుకేతువులు అసలు ఉనికి లోనే లేవని వారికి తెలియదు. రాత్రిపూట ఆకాశంలో పడుకొని పైకి చూస్తే నక్షత్రాల గుంపులు కనిపిస్తాయి. ఒక్కో గుంపు ఒక్కో ఆకారంలో కనిపిస్తే, వాటికి రాశులు అని పేర్లు పెట్టారు. ఇక్కడ మనకు వృషభం ఆకారంలో ఒక గుంపు కనిపిస్తే, అదే నక్షత్రాల గుంపు అమెరికాలో మీనం ఆకారంలో కనిపిస్తుంది. ఇది ఎలా శాస్త్రీయం? రాశులే కల్పితం.
ఇలాంటి రాశుల్లో గ్రహాలు దూరతాయట! అలా దూరిన సమయానికి ముహూర్తం అని జాతకాలు తయారుచేస్తారు. వీరు చెప్పే భవిష్యత్తు భూకేంద్ర సిద్ధాంతం మీద ఆధారపడింది. భూమి చుట్టూ సూర్యుడిని, ఇతర గ్రహాలని తిప్పుతారు. 1543లో కోపర్నికస్ సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తరువాత పంచాంగకర్తలు చెప్పే భూ కేంద్ర సిద్ధాంతం బద్దలైపోయింది. అయితే ఇప్పటికీ వారు భూకేంద్ర సిద్ధాంతాన్నే ఆధారం చేసుకొని జ్యోతిష్యం చెప్పుకుంటున్నారు. మనకి ఆకాశంలో కనిపించే నక్షత్రాలన్నింటిని పాలపుంత అంటాము. ఈ పాలపుంతలో పది వేల కోట్ల నక్షత్రాలున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలాంటి పాలపుంతలు ఈ విశ్వంలో పది వేల కోట్లు ఉన్నాయని ఒక అంచనా. వాటితో పోల్చుకుంటే మన భూమి ఒక చిన్న గోలీ కాయ లాంటిది. ఇవి ఏవీ ఈ జ్యోతిష్యులకు తెలియదు. ఆ పేరుతో దోచుకోవటమే వీరికి తెలిసింది.
నక్షత్రానికి నక్షత్రానికి కోట్ల మైళ్ళ దూరం ఉంది. ఒక్కో గ్రహానికి గ్రహానికి కోట్ల మైళ్ళ దూరముంది. కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న మనపై గ్రహాల ప్రభావం ఏమాత్రం ఉండదు. కాకపొతే సూర్యుడు మనకి దగ్గరగా ఉన్నందున సూర్యకాంతి ప్రభావం మనపై పడుతుంది. కానీ గ్రహాల కదలికల వలన మానవ జీవితంపై వాటి ప్రభావం ఉంటుందని ఈ జ్యోతిష్యులు ప్రజలను భయపెట్టి వచ్చినంత దోచుకుంటున్నారు. వీరు చెప్పేదంతా మోసం, అబద్ధం. బూటకం. 2019లో జగన్ గెలుస్తాడా, చంద్రబాబు గెలుస్తాడా, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో కచ్చితంగా చెప్పగలిగిన జ్యోతిష్యుడిని విజయవాడ పురవీధుల్లో ఏనుగుపై ఊరేగిస్తామని ప్రకటించాం. ఒక్కరూ రాలేదు.
రేపు ఉగాది రోజు చూడండి. చంద్రబాబుకి పంచాంగం చెప్పే పంతులు, వచ్చే ఎన్నికలలో నీవే తప్పక ముఖ్యమంత్రి అవుతావని చంద్రబాబుకి చెప్తాడు. జగన్ రెడ్డికి వాళ్ళ ఆస్థాన జ్యోతిష్యుడు ఇంకా 20 ఏళ్ళు నీవే ముఖ్యమంత్రివని చెప్తాడు. బిజెపి వారికి వారి ఆస్థాన జ్యోతిష్యుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి అని చెప్తాడు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఈ పంచాంగ పంతుళ్లు చెప్పే మోసపు మాటలు నమ్మొద్దు.
- నార్నె వెంకట సుబ్బయ్య










