- ఏడాదిలో రూ.16 కోట్లతో 3 రోడ్లే నిర్మాణం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రోడ్ల నిర్వహణపై ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం మూడంటే మూడే గ్రామీణ రోడ్లు వేశారు. అది కూడా 16 కోట్ల రూపాయలతో. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ, మండల స్థాయి రోడ్లు ఏళ్ల తరబడి అత్యంత దారుణంగా మారిపోయి కనీసం ద్విచక్ర వాహనాలు కూడా తిరిగే పరిస్థితి లేకపోగా, వాటిపై అధికారులు మాత్రం కనీసం దృష్టి సారించడం లేదు. తాజాగా ఆర్థికశాఖకు నివేదించిన ఒక నివేదికలో వెల్లడించిన వివరాలు ఆశ్చర్యంతోపాటు ఆందోళన కలిగిస్తున్నాయి. 2016-17 నుంచి 2020-21 వరకు 301 రోడ్ల పనులను రూ.882 కోట్లతో ప్రారంభించగా, అందులో 187 పనులను మాత్రమే పూర్తి చేయగలిగారు. అయితే ఈ నిధుల్లో ఏకంగా 370 కోట్ల విలువైన 99 పనులను అర్ధాంతరంగా రద్దు చేయడంతో భారీగా నిధులు వృథా అయినట్లు విమర్శలు వస్తున్నాయి. 2019లో ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి 25 శాతం కన్నా తక్కువ విలువైన పనులను నిలిపివేయాలన్న ఆదేశాల మేరకు రూ.370 కోట్ల విలువైన పనులు నిలిపివేసినట్లు ఆర్‌అండ్‌బి అధికారులు చెబుతున్నారు. ఇలా ఉండగా, ఎక్కడైనా మంత్రులు, అధికారులు పర్యటించిన సమయంలో మాత్రం కేవలం ఇసుక, మట్టి, కొద్దిపాటి కంకరతో కూడిన గుట్టలు వేసి ట్రాక్టర్లతో చదును చేసి పని పూర్తయిందనిపిస్తున్నారు.










