- కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ప్రజాశక్తి-విజయవాడ : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సోమవారం అధికారులతో కలిసి నగరంలోని గాంధీ కొండను పర్యవేక్షించారు. కొండ దిగువ ప్రాంతం, కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్, కొండపై ప్రజలకు అందుబాటులో గల ఆట పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండమీది ప్రాంతాన్ని ప్లాస్టిక్ ఫ్రీజోన్‌గా మార్చడానికి తగినచర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొండపైకి వెళ్లు ఘాట్ రోడ్‌నుంచే సెక్యురిటి ద్వారా ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ పరికరాలను నియంత్రించి ప్రజలకు దానిపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఘాట్ రోడ్ పక్కన ప్రహరీ గోడలు కొన్ని చోట్ల ఎత్తు తక్కువగాను, మరికొన్నిచోట్ల గోడలు అసలు లేకుండా ఉండటాన్ని గమనించి గోడల నిర్మాణంలో సరైన ఏర్పాట్లను చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ విషయÛంలో గాంధీ హిల్ ఫౌండేషన్ వారితో సమావేశం ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేలా, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఏర్పాట్లు ఉండాలని, ఇందుకు అవసరమైన డిజైన్, ప్రణాళికలను రూపొందించి నిర్మాణాలను పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. తదుపరి బిఆర్‌పి రోడ్, గణపతిరావు రోడ్, నెహ్రు రోడ్ మొదలగు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలిస్తూ, గణపతిరావు రోడ్‌లో ఎక్కువగా ఆవులు ఉండటాన్ని గమనించి పశువులను రోడ్లపైకి వదలకుండా పశువుల యజమానులను హెచ్చరించాలని అధికారులకు సూచించారు. గాంధీనగర్‌లో సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్‌లో పనుల పురోగతిని పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎఎస్‌ఎన్ ప్రసాద్, వి.శ్రీనివాస్ శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










