ప్రజాశక్తి - కొత్తచెరువు : రబీ సీజన్లో నిర్వహించిన ఈ పంట నమోదు కార్యక్రమం పక్కాగా చేపట్టామని కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం కొత్తచెరువు మండలంలోని కొత్తపల్లి, మీర్జాపురం, కె.లోచర్ల గ్రామాల్లో జాయింట్ అజమాయిషీ కింద చేపట్టిన ఈ పంట నమోదు సూపర్ చెక్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల పొలాలను పరిశీలించారు. ఇందులో భాగంగా పంట వివరాలు సక్రమంగా నమోదు అవుతున్నాయా లేదా అనేది పరిశీలించారు. ముందుగా కొత్తపల్లి గ్రామంలో చంద్రమోహన్ రెడ్డి రైతు పొలంలో మిరప, బెండ పంటలను పరిశీలించి వివరాలు సక్రమంగా నమోదు చేశారా అని ఆరా తీశారు. అనంతరం తలమర్ల రెవెన్యూ పరిధిలోని మీర్జాపురం గ్రామంలో రైతు భూమన్నగారి వెంకట రెడ్డి పొలంలో వేరుశెనగ పంటను కలెక్టర్ పరిశీలించారు. అలాగే లోచర్ల గ్రామంలో కూడా ఈ పంట నమోదును పరిశీలించారు. అన్ని రకాల వివరాలు నమోదు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జాయింట్ కలెక్టర్ చేతన్ ఈ పంట నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని బైరాపురం లోచర్ల కొత్త చెరువులోని ధర్మవరం రోడ్డులో రైతు పిఎస్ శ్రీనివాసులు సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు.
నాణ్యమైన సేవలు అందించాలి : మండలంలోని మైలసముద్రం, మీర్జాపురం, తలమర్ల గ్రామ సచివాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పాఠశాలలను తనిఖీ చేయాలని, పాఠశాలల తనిఖీ సమయంలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని సూచించారు. పాఠశాలల తనిఖీ అనంతరం ఫోటోలను పంపించాలన్నారు. ఆయా సచివాలయాల పరిధిలో సర్వీసులను మరింత పెంచాలని, ఎప్పటికప్పుడు సర్వీసులను పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ పూర్తి స్థాయిలో నమోదు చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, తహశీల్దార్ రామాంజినేయరెడ్డి, ఎంపిడిఒ సిద్ధారెడ్డి, ఎడిఎ స్వయంప్రభ, ఏవో నటరాజ్, సచివాలయ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల : మండలంలో రబీ సీజన్లో సాగుచేసిన వేరుశనగ పంట పొలాలను కలెక్టర్ బసంత్ కుమార్ మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా మండలంలోని జక్కసముద్రం, పులేరు, బూదిలి గ్రామాల్లో రబీలో సాగుచేసిన వేరుశనగ పంటలను పరిశీలించారు ఈ క్రాప్ బుకింగ్ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రంగనాయకులు, వ్యవసాయ శాఖ ఎడి అల్తాఫ్, మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా రైతులు పాల్గొన్నారు.










