Feb 09,2022 09:29

బెంగళూరు : కర్ణాటకలోని హిజాబ్‌ వివాదం సరిహద్దులను దాటి పక్కరాష్ట్రాలకు పాకింది. మధ్యప్రదేశ్‌, పుదుచ్చేరిలో దీనిపై రచ్చ మొదలైంది. మధ్యప్రదేశ్‌లో ఓ మంత్రి హిజాబ్‌ను వ్యతిరేకించగా.. పుదుచ్చేరి అరియాం కుప్పంలో ఓ విద్యార్థిని హిజాబ్‌ ధరించడంపై ఉపాధ్యాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్రమశిక్షణకు ప్రాధాత్యనిస్తుందంటూ... హిజాబ్‌ నిషేధానికి మధ్యప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ మంత్రి ఇందర్‌ సింగ్‌ పర్మార్‌ మద్దతునిచ్చారు. హిజాబ్‌ స్కూల్‌ యూనిఫాం కాదని, అందుకే పాఠశాలల్లో దాని ధరించడం నిషేధించాలని అన్నారు. సంప్రదాయాలను ప్రజలు వారి ఇళ్లల్లో పాటించాలని, పాఠశాలల్లో కాదంటూ వ్యాఖ్యానించారు. స్కూల్స్‌లో డ్రెస్‌ కోడ్‌ను కఠినంగా అమలు చేయడానికి తాము కృషి చేస్తామని అన్నారు. స్కూల్స్‌లో హిజాబ్‌ను నిషేధిస్తారా అన్న ప్రశ్నకు.. ఈ సమస్యను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనిపై విమర్శలు మొదలయ్యాయి. కోవిడ్‌ మధ్య పాఠశాలలు సక్రమంగా పనిచేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా విద్యా నాణ్యతను మెరుగుపర్చడం లేదా మతమరమన విభజన ఎజెండాను అనుసరించడం... వీటిలో దేనికీ ప్రాధాన్యతనిస్తారో సెలవువ్వాలని కాంగ్రెస్‌ ప్రతినిధి అబ్బాస్‌ హఫీజ్‌ అన్నారు.
ప్రతి పౌరుడు తమ మతాన్ని ఆచరించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, కానీ బిజెపి ప్రభుత్వం పాఠశాలలకు వెళ్లే పిల్లలను.. వారి మతాచారాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. సిక్కులు తలపాగా ధరించడం, ముస్లిం మహిళలు హిజాబ్‌ ధరించడం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుందని అన్నారు. కానీ ఈ బిజెపి ప్రభుత్వం.. పురాతన సంప్రదాయాలకు స్వస్థి పలికాలని భావించడం, వారి మానసిక దివాళా కోరుతనాన్ని నిదర్శనమని అన్నారు. మరో వైపు పుదుచ్చేరిలో .ఓ విద్యార్థిని ధరించిన హిజాబ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఉపాధ్యాయుడిపై విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థల నుండి తమకు ఫిర్యాదులు అందాయని విద్యా డైరెక్టరేట్‌ ప్రతినిధి తెలిపారు. అసలేం జరిగిందో పాఠశాల నుండి నివేదిక స్వీకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, బాలిక మూడేళ్లుగా హిజాబ్‌ ధరించి తరగతులకు హాజరవుతుండగా.. ఇప్పుడు అభ్యంతరం ఎందుకు వచ్చిందంటూ వామపక్ష మద్దతు విద్యార్థి సంఘం ప్రశ్నించింది.
కాగా, హిజాబ్‌కు అనుకూలంగా ఐదుగురు విద్యార్థినిలు కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. శాంతిని పరిరక్షించాలంటూ కోర్టు కోరింది. హిజాబ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బమ్మై సెలవులు ప్రకటించిన సంగతి విదితమే. గత నెలలో ఉడిపిలోని ఓ కళాశాలలో విద్యార్ధినిలను హిజాబ్‌ ధరించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన నాటి నుండి ఈ వివాదం ప్రారంభమైంది. కాషాయ మూకలు దీన్ని మరింత రెచ్చ గొట్టేలా చేశాయి.