ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి కలెక్టర్ బసంత్‌కుమార్ వివరించారు. శనివారం రాష్ట్రంలోని కలెక్టర్లు, ఎస్‌పితో విజయవాడ నుంచి జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. సెల్‌ఫోన్లు తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలని, వేసవి అయినందున తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. బస్సు సౌకర్యంతోపాటు జిల్లాకేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసుకోవాలని, 108 వాహనం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. శాంతి భద్రతలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ బసంత్‌కుమార్ జిల్లాలో పరీక్షలు సజావుగా జరగడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని వివరించారు. జిల్లాలో మొత్తం 39 పరీక్ష కేంద్రాలకు ఇంటర్ మొదటి సంవత్సరం 9309 మంది, రెండవ సంవత్సరం 12,597 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పి రాహుల్‌దేవ్‌సింగ్, ఇంటర్మీడియట్ ఆర్‌ఐఒ సురేష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ బసంత్‌కుమార్, ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్










