Dec 29,2022 21:36

వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

        ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌: డా||వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద జిల్లాలో 461 గ్రామాల్లో 333 గ్రామాల్లో డ్రోన్‌ ద్వారా రీ సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం నాడు విజయవాడ సిసిఎల్‌ఎ కార్యాలయం నుంచి భూరక్ష పథకం, రీసర్వే తదితర అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌, డిఆర్‌ఒ కొండయ్య, సర్వే ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంలో భాగంగా జిల్లాలో రీసర్వే పనులు త్వరితగతిన చేపట్టేలా అన్ని రకాల చర్యలూ తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 26 గ్రామాల్లో 7 గ్రామాలకు సంబంధించి ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌ (ఎల్పీఎం) ప్రింటింగ్‌ కూడా వచ్చిందన్నారు. మిగిలిన గ్రామాల్లో ప్రింటింగ్‌ ప్రక్రియ జరుగుతోందన్నారు. జిల్లాలో 24 గ్రామాలకు విలేజ్‌ మ్యాప్‌లు వచ్చాయన్నారు. గ్రౌండ్‌ టు థింగ్‌కు సంబంధించి 4 గ్రామాల్లో ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. రీ సర్వేకు సంబంధించి అన్ని ప్రక్రియలను జనవరి 15వ తేదీ లోపు పూర్తి చేసేందుకు అన్ని విధాలా చర్యలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
వేగవంతంగా రహదారుల భూసేకరణ
జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాధాన్యతను గుర్తించి భూసేకరణ, పరిహారం చెల్లింపులు చేపట్టి రహదారుల నిర్మాణాల వేగవంతానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్డు రవాణా, ఆర్‌అండ్‌బి ప్రిన్సిపల్‌ సెక్రటరీ పిఎస్‌.ప్రద్యుమ్న సూచించారు. గురువారం మధ్యాహ్నం అమరావతి నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా, ఆర్‌అండ్‌బి ప్రిన్సిపల్‌ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్లోనే స్పందన వీడియోకాన్ఫరెన్స్‌ హాలులో కలెక్టర్‌ పి.బసంత్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎస్‌.ప్రద్యుమ్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణాలకు రూ.50 వేల కోట్లు అందుబాటులో ఉందన్నారు. భూసేకరణ, పరిహారాల చెల్లింపు పూర్తి చేసి ప్రారంభంకాని రహదారులను ప్రారంభించాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి చేరుకునేందుకు అన్ని వైపుల నుంచి రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు జిల్లాకేంద్రం మీదుగా నాలుగు లైన్ల రహదారికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు. ఇందుకు సంబంధించి భూ సేకరణ కార్యక్రమం వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.