Jan 31,2023 21:13

చెక్‌ అందజేస్తున్న కలెక్టర్‌

చెక్‌ అందజేస్తున్న కలెక్టర్‌
పకడ్బందీగా పరివర్తన 2.0 కార్యక్రమం అమలు
నెల్లూరు:నాటుసారా రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పరివర్తన 2.0 కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌ కెవిఎన్‌. చక్రధర్‌ బాబు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప గ్రామానికి చెందిన 17 నాటుసారా తయారీ కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనలో భాగంగా ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 17 లక్షల రూపాయల మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరివర్తన 2.0 కార్యక్రమంలో భాగంగా సెబ్‌ (స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ బ్యూరో) ఆధ్వర్యంలో జిల్లాలో నాటుసారా తయారీదారులను గుర్తించి, వారికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు
. వీరందరికీ డిఆర్డిఏ ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేయించి నాటుసారా తయారీని పూర్తిగా నివారించి, ప్రత్యామ్నాయ జీవనోపాధులను కల్పిస్తున్నట్లు చెప్పారు. మేకలు, గొర్రెల పెంపకం, చిన్న తరహా వ్యాపారాలపై అవగాహన కల్పించి రుణాలు మంజూరు చేయించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నాటుసారా తయారీదారులు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ నాటుసారా తయారీని పూర్తిగా నిలుపుదల చేసి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపాధి పొందాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ సూచించారు. అనంతరం సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ శ్రీలక్ష్మి, డిఆర్డిఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సాంబశివారెడ్డి లబ్ధిదారులకు నాటుసారా తయారీ వల్ల కలిగే అనర్ధాలు, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల ద్వారా కలిగే ప్రయోజనాలను లబ్ధిదారులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సెబ్‌ అధికారులు ఎస్‌ రవికుమార్‌, ఎస్‌ కష్ణ కిషోర్‌ రెడ్డి, కే శ్రీనివాసరావు, డి ఆర్‌ డి ఏ సిబ్బంది మస్తాన్‌, నాగమణి తదితరులు పాల్గొన్నారు.