Mar 31,2023 20:31

పకడ్బందీగా 'పది' పరీక్షల నిర్వహణ : కలెక్టర్‌

రాయచోటి : జిల్లాలో ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ గిరీష విద్యాశాఖ చీఫ్‌ సూపరింటెండెంట్లను ఆదేశించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్‌ నందలి స్పందన హాలులో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై డిఇఒ ఆధ్వర్యంలో చీప్‌ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల అధికారులతో ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన జిల్లాలో గత సంవత్సరం పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి మంచి పేరు తీసుకువచ్చారని తెలిపారు. ఈ ఏడాది కూడా ఎలాంటి చిన్న పొరపాటుకు, సంఘటనలకు తావివ్వకుండా పరీక్షలను చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా విజయవంతం చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు అన్ని పూర్తి చేయాలని డిఇఒకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు అనుమతించరాదన్నారు. ప్రభుత్వం కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో తాగునీరు, వైద్య శాఖ ఎఎన్‌ఎంతో పాటు విద్యార్థులకు అవసరమైన మందులు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పరీక్షల విజయవంతానికి అందరూ సమన్వయంతో కృషి చేయాలన్నారు. అనంతరం డిఇఒ పురుషోత్తం మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. గత సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదన్నారు. పరీక్షల నిర్ణీత సమయానికి ముందే అధికారులందరూ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా సమయం 15 నిమిషాల ముందు మాత్రమే క్వశ్చన్‌ పేపర్లను ఓపెన్‌ చేయాలన్నారు. మాస్‌ కాపీయింగ్‌ ప్రోత్సహించరాదని, మొబైల్‌ ఫోన్స్‌ తీసుకెళ్లకూడదని వివరించారు. అవగాహన కార్యక్రమంలో చెందిన చీఫ్‌ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.