పకడ్బందీగా 'పది' ముల్యాంకనం -ఎస్‌ఎస్‌సి పరీక్షల పరిశీలకులు మార్తాల వెంకటకష్ణారెడ్డి
రాయచోటి: పదవ తరగతి మూల్యాంకనాన్ని పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్ల మధ్య పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పరీక్షల పరిశీలకులు మార్తాల వెంకటకష్ణారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సాయి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. మూల్యాంకన కేంద్రంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే తీరును పరిశీలించారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని డిఇఒ పురుషోత్తమ్‌కు సూచించారు. పదో తరగతి పరీక్ష జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు వచ్చే సిబ్బందికి వేసవి కారణంగా అసౌకర్యం కలగకుండా తీసుకున్న చర్యలను, వసతులను పర్యవేక్షించారు. ప్రతి గదికీ ఫ్యాన్లు, లైట్లు ఉండేలా చూడాలన్నారు. తాగునీరును అందుబాటులో ఉంచాలన్నారు. ఎలాంటి ఇక్కట్లు లేకుండా స్పాట్ కొనసాగేందుకు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈనెల 19 నుంచి ప్రారంభమైన మూల్యాంకనం 26 నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక బద్ధంగా కషి చేయాలన్నారు. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రానికి ప్రతీ ఉపాధ్యాయుడూ విధిగా గుర్తింపు కార్డు (ఐడికార్డు)తో రావాలని, మాస్క్ ధరించాలని, ఎవరు కూడా సెల్‌ఫోన్లు వినియోగించరాదని ఆదేశాలు జారీ చేశారు. సమిష్టి కషితో మూల్యాంకనాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రసాద్ బాబు, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ క్రిష్టప్ప, పిఆర్‌టియు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీనివాసరాజు, జిల్లా స్కౌట్ సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు పాల్గొన్నారు.










