Mar 06,2023 20:55

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకులు

  కడప శాసనమండలి ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు డాక్టర్‌ పోలా భాస్కర్‌, ఎం.హరి జవహర్‌లాల్‌ నోడల్‌ అధికారులను ఆదేశించారు. శాసన మండలి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల పరిశీలకులు వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలు, జెసిలతో కలసి నోడల్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు వి.విజరు రామరాజు, గిరీషా పి.ఎస్‌. లతో పాటు ఎస్‌పిలు అన్బురాజన్‌, హర్షవర్ధన్‌రాజు, జెసి సాయికాంత్‌ వర్మ, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, కడప నగర కమిషనర్‌ ప్రవీణ్‌ చంద్‌, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, అన్నమయ్య డిఎఫ్‌ఓ వినోద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలవ్వాలని, జిల్లాల్లో ఇప్పటికే ప్రకటించిన పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ మెటీరియల్‌ చెక్‌ లిస్టు ఆధారంగా పోలింగ్‌కు రెండు రోజుల ముందే చేరుకొని ఏర్పాట్ల సరిచూసుకోవాలని తెలిపారు. పోలింగ్‌ రోజు పోలీస్‌ భద్రత, ప్రిసైడింగ్‌ అధికారి డైరీ నిర్వహణ, ప్రశాంత పోలింగ్‌ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుతో ఓటు హక్కు వినియోగం, సూక్ష్మ పరిశీలకుల నివేదిక, వెబ్‌ కాస్టింగ్‌ / వీడియో నిర్వహణ, పరిసరాల్లో ఎలక్షన్‌ కోడ్‌ అమలు, పోలింగ్‌ ముగింపు తర్వాత బ్యాలెట్‌ బాక్సుల భద్రత, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడా ఎటువంటి సమస్య లేకుండా ఎన్నికలు జరిగేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అంతకు ముందు వైఎస్‌ఆర్‌ జిల్లా ఎన్నికల అధికారి వి.విజరు రామరాజు పిపిటి ద్వారా వివరిస్తూ. ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను విజవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లను ప్రణాళిక ప్రకారం సంసిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్నికల విధుల్లో అనుభవం ఉన్న అధికారులతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల విధులను చేపడుతున్నామన్నారు. ఇప్పటికే పీవోలు, ఏపీవోలకు, మైక్రో అబ్జర్వర్స్‌కు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చామని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 131 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశామని ఎన్నికల నిర్వహణ సిబ్బందికి సంబంధించి 191 పీవోలు, 191 ఏపీవోలు, 393 ఓపీవోలను నియమించామని తెలిపారు. పోలింగ్‌ మెటీరియల్‌ కొనుగోలు ప్రక్రియ కూడా జరుగుతోందన్నారు. బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్స్‌ ను సిద్ధం చేసుకున్నామన్నారు. జిల్లాలో 37 సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లను కూడా గుర్తించి అదనపు భద్రతా సిబ్బందిని సిద్ధం చేశామన్నారు. వెబ్‌ కాస్టింగ్‌ కోసం ఇంజినీరింగ్‌ విద్యార్థులను తీసుకున్నామని తెలిపారు. పోలింగ్‌ మెటీరియల్‌ రవాణా చేసేందుకు జిల్లాలో 21 రూట్లను ఎంపిక చేశామన్నారు. గట్టి పోలీసు బందోబస్తును సిద్ధం చేసుకున్నామని తెలిపారు. అనంతరం రెండు జిల్లాల నోడల్‌ అధికారులు వారు నిర్వర్తించే విధులను ఎన్నికల పరిశీలకులకు వివరించారు. సమీక్షా సమావేశంలో వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల ఆర్డీవోలు, జెడ్పి సీఈవోలు, డిపివోలు, ఎన్నికల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.