పెనుకొండ : ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పి.బసంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీసత్య సాయి జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 99 కేంద్రాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షల మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆంగ్ల పరీక్ష నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో, డిఐవిఇఒ రఘునాథరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ బషీర్, ఉదరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తచెరువు : ప్రభుత్వ, శివ సాయి జూనియర్ కళాశాలల్లో శుక్రవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఆంగ్ల పేపర్ పరీక్షలకు 37 మంది గైర్హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ చంద్రమౌళి తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో 381 మందికి గాను 258 మంది, శ్రీ శివ సాయి కళాశాలలో 322 మంది విద్యార్థులకు గాను 308 మంది హాజరయ్యారని చెప్పారు.
మడకశిర : మడకశిర పట్టణంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న మూడు కేంద్రాలను హై పవర్ కమిటీ స్క్వాడ్ బృందం సభ్యులు రమణ కుమార్, షఫీ తనిఖీ చేశారు. మడకశిర పట్టణంలోని జూనియర్ కళాశాల, వృత్తి విద్య కళాశాల, వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో శుక్రవారం రోజు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించారు. హైపవర్ కమిటీ స్క్వాడ్ సభ్యులు ఈ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
రొద్దం : మండలంలోనిజూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 109 మంది విద్యార్థులకు గాను 107మంది హాజరయ్యారని ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు.










