కొత్తచెరువు : జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బసంత్‌కుమార్ తెలిపారు. కొత్తచెరువు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల. శివ సాయి జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు.
రొద్దం : మండలంలోని జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 84 మంది విద్యార్థులకు గాను 82మంది పరీక్షలకు హాజరయ్యారని ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలపారు. ఎస్ ఐ నాగస్వామి ఆధ్వర్యంలో పోలీసులు మహేష్, రాజేశ్వరి బందోబస్తు నిర్వహించారు.
లేపాక్షి : మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సజావుగా జరిగాయి. చీప్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మొదటిరోజు పరీక్షకు 192 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ఏడుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. రాష్ట్ర పరీక్షల పరిశీలకులు పరీక్షా కేంద్రాన్ని సందర్శిం చారు.
అమడగూరు : మండల పరిధిలోని శీతి రెడ్డిపల్లి సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మోడల్ స్కూల్, కస్తూరిబా పాఠశాల విద్యార్ధులు పరీక్షలు హాజరయ్యారు. మొదటి రోజు మొదటి సంవత్సరం తెలుగు,హిందీ పరీక్షలకు మొత్తం 87 విద్యార్థులకు గాను 84మంది హాజరయ్యారని చీఫ్ ప్రభాకర్, డిఒ వెంకటరమణ తెలిపారు.










