పుట్టపర్తి అర్బన్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఎన్నికల నియమ, నిబంధనలు పాటించాలని కలెక్టర్ బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల రిసెప్షన్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, ఆర్డీవో భాగ్యరేఖతో కలిసి మంగళవారం పరిశీలించారు. పట్టణంలోని చిన్నపల్లి, ఎనుములపల్లి ఉన్నత పాఠశాలలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. జిల్లాలో గ్రాడ్యుయేట్ కు 43వేలు, ఉపాధ్యాయులకు 3200 ఓటర్లు ఉన్నారన్నారు. 86 పోలింగ్ స్టేషన్‌లను జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. 11 రూట్లను గుర్తించినట్లు చెప్పారు.
ఎన్నికలను బాధ్యతాయుతంగా నిర్వహించాలి : డిఆర్‌ఒ
జిల్లాలో ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య సంబంధిత ఎన్నికల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సెక్టార్, రూట్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. రూట్ ఆఫీసర్లు పిఒలు, ఎపిఒలు సమన్వయంతో పని చేయాలన్నారు. సెక్టార్ అధికారులు ముందుగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి అవసరమైన సౌకర్యాలు గుర్తించి, వాటిని పూర్తి చేయాలన్నారు. ఇదివరకే ఎన్నికల విధులలో పాల్గొన్న అధికారులు గత అనుభవాలను దష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు. 24 లోగా నివేదిక తనకు సమర్పించాలన్నారు. మార్చి 12లోగా ఎన్నికల సామగ్రిని తరలించేందుకు వాహనాలను సమకూర్చుకోవాలన్నారు. బ్యాలెట్ బాక్సులను పుట్టపర్తి ప్రధాన కేంద్రం నుంచి పంపిణీ చేస్తామన్నారు. మార్చి 13న జరిగే ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ కషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ మైముద్దీన్‌తోపాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










