రాయచోటి : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే పకడ్బందీగా జరగాలని అధికారులను చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్‌రెడ్డి అన్నారు. గురువారం విజయవాడలోని రాష్ట్ర సచివాలయం నుంచి రెవెన్యూ, అగ్రికల్చర్, హార్టికల్చర్, సీరికల్చర్, అనిమల్ హస్బండ్రీ, హౌసింగ్, వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి కలెక్టర్ గిరీష్‌్, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ కీలకమైన డ్రోన్ సర్వే, ఆ తర్వాత దశల్లో జరిగే క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ, గ్రౌండ్ వాలిడేషన్ వంటి పనులన్నీ చకచకా ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రీ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. మొదటి దశలో రెండువేల గ్రామాలలో, రెండవ దశలో రెండు వేల గ్రామాలలో రీ సర్వే చేపట్టామన్నారు. మొదటి దశ, రెండవ దశ ప్రగతిలపై ఆయన సమీక్షించారు. గ్రౌండ్ ట్రూతింగ్, డ్రోన్ సర్వే, మ్యుటేషన్స్ తదితర అంశాలలో లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మొదటి పేజ్‌లో కరెక్షన్స్, రిజిస్ట్రేషన్ లు ఫిబ్రవరి 16కల్లా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర రహదారుల ప్రాధాన్యతను గుర్తించాలని, భూసేకరణ వేగవంతానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా రివ్యూ చేసి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. రబీ ఈక్రాప్ బుకింగ్ గడువులోగా పూర్తి చేయాలన్నారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినందున రైతులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించి వాటి సాగును ప్రోత్సహించేలా రైతులకు సూచనలు, సలహాలు క్షేత్రస్థాయిలో అందివ్వాలని తెలిపారు. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలని, రోజువారీ ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక రోగాలును అరికట్టవచ్చని చెప్పారు. పల్లెల్లో పాల వెల్లువ పరిఢవిల్లేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, నాణ్యమైన పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ల(ఏఎంసీయూ)ను ఏర్పాటు చేస్తోంది. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ల నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పూర్తిపై అధికారుల ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్టేజ్ కన్వర్షన్ మీద ఫొటోస్ పెట్టాలని సూచించారు. ఇంకా వివిధ ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చీఫ్ సెక్రటరీ జిల్లాల కలెక్టర్‌లు, జెసిలు, జిల్లా అధికారులకు దిశ నిర్దేశించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ గిరీష మాట్లాడుతూ మత్స్య సంపద యువతలో స్వయం ఉపాధి కోసం ఫిష్ ఆంధ్ర మినీ ఫిష్ రిటైల్ ఔట్లెట్‌లు ప్రతి మండలంలో ఒకటి చొప్పున ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిఆర్‌డిఎ పీడీని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో రీ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. ఫైనల్ ఆర్‌ఓఆర్, తదితర కార్యక్రమాలను వేగవంతం చేయాలని, రీ సర్వేలో ఆయా దశలలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రబీ సీజన్ ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీ మీద ప్రత్యేక ద ష్టి పెట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.










