Jul 14,2021 09:49

హైదరాబాద్‌ : మీ వాహనాలకు వాహన కాలుష్య ధ్రువీకరణ పత్రం (పియుసి) ఉందా ? కాలుష్య పరీక్ష చేయించి చాలా రోజులయ్యిందా ? ఇక నుండి ఇలా ఆలస్యం కావడానికి వీలులేకుండా 'ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ కమిటీ' నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా ఒక్క రోజు ఆలస్యమయినా మీ వాహనంపై జరిమానా పడిపోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమయింది.

ఆన్‌లైన్‌ ద్వారా తెలుస్తుంది.. జరిమానా పడుతుంది..
నూతన విధానమేమంటే... వాహన కాలుష్య పరీక్షలను చేయించుకున్న వెంటనే ఆ పరీక్షలు, ఫలితాల వివరాలను ఆన్‌లైన్‌ చేయబోతున్నారు. వెంటనే ఆ వివరాలన్నీ సర్వర్‌కు వెళ్లిపోతాయి. రవాణాశాఖ, పోలీస్‌శాఖలకూ చేరిపోతాయి. ఆరు నెలల గడువులోపు కాలుష్య పరీక్ష చేయించకపోతే ఆటోమేటిక్‌గా జరిమానా పడిపోతుంది. ఆగస్టులో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు.

ముందుగా హైదరాబాద్‌లో..
పిసిబి, రవాణా, పోలీసు, పురపాలక, తదితర శాఖలు ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ కమిటీలో ఉన్నాయి. ముందుగా నూతన విధానాన్ని హైదరాబాద్‌లో అమలు చేసి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల వాహనాలు ఉండగా.. హైదరాబాద్‌లోని వాహనాల నుంచే రోజుకు 1,500 టన్నుల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వాయుకాలుష్యం దాదాపు 50 శాతానికి పైగా వాహనాల నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో వాహన కాలుష్య కట్టడికి కాలుష్య ధ్రువీకరణ పరీక్షలు, ఫలితాల్ని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేయాలని ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ కమిటీ నిర్ణయించింది.