May 09,2021 12:27

సాయంత్రం వేళ ! చల్లగాలి కోసం తాతగారు డాబా మీద తిరుగుతున్నారు! మనవరాలు మిల్కీ తాతగారితో పాటు నడుస్తుంది. చుట్టుపక్కల అక్కడక్కడా పచ్చని చెట్లు! ఆ చెట్లపై కిలకిలారావాలు చేస్తూ ఎగురుతున్న పక్షులు! ఒక అందమైన దృశ్యమది! తాతామనవరాళ్ళు ఆ దశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. అంతలో ఆ తాతామనవరాళ్ళకు గోరపిట్ట అరుపులు, కాకి కావు కావుమన్న గట్టికూతలు వినిపించాయి. తల తిప్పి చూశారు. వీధి విద్యుత్‌ స్తంభం మీద కాకి గోరపిట్టపై దాడి చేస్తుంది. కాకి దాడిని గోరపిట్ట ధైర్యంగా ఎదుర్కొంటుంది. గోరపిట్ట గూడు విద్యుత్‌ స్తంభం మీద ఉంది. ఆ గూడులో కాకి ముక్కు పెట్టడానికి ప్రయత్నిస్తుంది. గోరపిట్ట సూది ముక్కుతో కాకి కళ్ళపై పొడవడానికి చూస్తుంది. కాకి దగ్గర గోరపిట్ట చిన్నదిగా కనిపించినా ఆ పోరాటంలో అది వెన్ను చూపలేదు. దాని సాహసం దగ్గర దౌర్జన్యం చూపిన కాకి తోక ముడిచి దూరంగా ఎగురుకుంటూ పోయింది. మిల్కీ గోరపిట్ట ఓడిపోతుందనుకుంది. కాని విచిత్రంగా ఆ చిన్నపిట్ట విజయం సాధించింది.
తాతగారి వైపు చూసి మిల్కీ ''తాతగారూ! గోరపిట్టకంత బలం ఎలా వచ్చింది? కాకి పెద్దది కదా, ఎందుకు భయపడి ఎగురుకుంటూ పోయింది?'' అని అడిగింది. అప్పుడు తాతగారు ''గోరపిట్టది ధర్మపోరాటం! ఆ పోరాటంలో లొసుగు లేదు. పాపం లేదు. గూటిలో తాను పెట్టిన గుడ్లను రక్షించుకోడానికి అది సాహసం చేసింది. ఎక్కడ లేని ధైర్యం కూడదీసుకొని ప్రాణాలకు తెగించి పోరాడింది. అలా పోరాటం చేయకపోతే అది పెట్టిన గుడ్లకు రక్షణ లేకపోయి ఉండేది! ఇక కాకి సంగతంటావా? వేరొక పక్షి పెట్టిన గుడ్లు పాడు చెయ్యాలనుకోడం చాలా తప్పు. ఆ పని తప్పని కాకికి తెలుసు. అది చేసే పనిలో లొసుగుంది. తప్పు చేసిన వాళ్ళలో భయం పొంచి ఉంటుంది! ఇటువంటి వాళ్ళు అవతలి వారు నిలబడితే కలబడతారు. కలబడితే పారిపోతారు. వాళ్ళలో నైతిక బలముండదు. అందుకే ప్రాణాలకు తెగించి గోరపిట్ట ఎప్పుడైతే పోరాడిందో కాకికి భయమేసి పారిపోయింది'' అని వివరించారు తాతగారు. మిల్కీ చిన్న పిల్లేమీ కాదు. ఎనిమిదో తరగతి చదువుతోంది. తాతగారి మాటలు తనలో ధైర్యం పెంచాయి. ఆమె మర్నాడు పాఠశాలకు బయలు దేరింది. వీధి మలుపు తిరిగాక ఒక ఆకతాయి యువకుడు అలవాటు ప్రకారం మిల్కీ వెంటపడ్డాడు. మిల్కీలో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఆమె కళ్ళ ముందు గత సాయంత్రం గోరపిట్ట కాకిని తరిమే దృశ్యం మెదిలాడింది. అంతే! తిరగబడింది. వెళ్తున్న ఆమె నిలబడిపోయింది.
''రారా నీ పాపం పండింది!!''అని పుస్తకాల సంచిని పైకెత్తింది. అంతటితో ఆగకుండా చుట్టుపక్కల వారిని కేకలేసి పిలిచింది. వెంటపడ్డవాడు వెనకడుగు వేశాడు. చుట్టుపక్కల వారు తన వైపు రావడం చూసి అక్కడ నుంచి పారిపోయాడు. ''పిట్ట నేర్పిన పాఠం బాగానే పనికొచ్చింది'' అనుకుంటూ పాఠశాల వైపు అడుగులు వేసింది మిల్కీ! ఆ తరువాత మిల్కీకి మరెప్పుడూ ఆ సమస్య రాలేదు.
 

- బెలగాం భీమేశ్వరరావు
99895 37835