Feb 27,2022 07:13
  • ఇంకా ఏడేళ్ల నాటి స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ ఎకరాకు రూ.6 వేలు
  • కేంద్రానిది ఇంకా తక్కువ - కొన్ని రెట్లు పెరిగిన సాగు ఖర్చులు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : విపత్తులతో పంట లు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకూ చాలట్లేదు. రాష్ట్ర విభజన అనంతరం ఎప్పుడో ఏడేళ్లనాడు హుదూద్‌ తుపానప్పుడు ఖరారు చేసిన మొత్తాన్నే (స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌) ఇప్పుడూ అమలు చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు, నిపుణుల అధ్యయనం తర్వాత 2015-20 ఐదేళ్ల కాలానికి కేంద్రం 2015లో స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ను నిర్ణయించగా, ఎపి సర్కారు అప్పటికే అంతకంటే ఎక్కువ ఇస్తున్నందున, కేంద్రం సూచనలు స్వీకరిస్తూనే, 2014లో హుదూద్‌ నాడు నిర్ణయించిన సాయాన్ని అప్పటి టిడిపి ప్రభుత్వం కొనసాగించింది. కాగా తిత్లీ తుపాను సమయంలో వాస్తవంగా జరిగిన నష్టాలను రైతులకు సహాయంగా అందించట్లేదని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి ఆందోళన చేయడంతో పాటు తాము అధికారంలో కొస్తే వాస్తవ నష్టాలకనుగుణంగా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది. వైసిపి వచ్చి రెండున్నరేళ్లు దాటినా టిడిపి హయాంనాటి స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌నే అమలు చేస్తోంది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2021-22 నుండి 2025-26 కాలానికి స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ నిర్ణయించాల్సిన కేంద్రం మీనమేషాలు లెక్కి స్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంతో విపత్తు రైతులు పిసరంత సాయంతో సరిపెటు ్టకోవాల్సి వస్తోంది.

  • ఇంత తక్కువా!

పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) పేరిట ప్రభుత్వం ప్రధాన పంటలకు ఇచ్చేది ఎకరాకు రూ.6 వేలు మాత్రమే. అవే పంటలకు కేంద్రం నిర్ణయించింది రూ.2,720. వరి, వేరుశనగ, పత్తి, చెరకు, మిర్చి, కూరగాయలు, ఉల్లి, పూలు, బొప్పాయి, పుచ్చకాయలకు అంతే పరిహారం. ఉదాహరణకు ఎకరా మిర్చి సాగుకు రైతుకు రూ.లక్ష పెట్టుబడి అవుతుంది. కౌలు రైతులకు మరో రూ.50 వేలు అదనం. ప్రభుత్వం ఇచ్చేది రూ.6 వేలు. వరి సాగుకు రైతు పెట్టేది రూ.20 వేలు. కౌలు రైతులైతే రూ.30 వేలు. సర్కారు ఇస్తున్నది రూ.6 వేలు. ఈ సాయం కూడా ఐదెకరాల్లోపు రైతులకే. మామిడి, నిమ్మజాతి పండ్ల తోటలకుకు రూ.8 వేలు కాగా అరటికి రూ.10 వేలు.

  • ఇదేం సాయం?

2010-15 కాలానికి 13వ ఆర్థిక సంఘం సూచనల మేరకు అప్పటి యుపిఎ సర్కారు 2013లో స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ నిర్ణయించింది. మెట్ట ప్రాంతాల్లో ఎకరాకు రూ.1,800, సాగునీటి సౌకర్యం కలిగిన ఏరియాలో రూ.3,600, దీర్ఘకాలిక పంటలకు రూ.4,800గా నిర్ణయించింది. అప్పటికే ఉమ్మడి ఎపి ప్రభుత్వం అంతకంటే ఎక్కువే ఇచ్చింది. ప్రధాన పంటలకు ఎకరాకు రూ.4 వేలు ఇస్తోంది. ఆ మేరకు విభజనకు ముందు 2014 ఫిబ్రవరి 5న జిఒ నెం.4 విడుదలైంది. నవ్యాంధ్ర ఏర్పడ్డాక హుదూద్‌ తుపాను సమయంలో టిడిపి ప్రభుత్వం ప్రధాన పంటలకు స్కేల్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ రూ.6 వేలు చేస్తూ 2014 అక్టోబర్‌ 12న జివొ నెం.9 ఇచ్చింది. అనంతరం 2015-20 కాలానికి 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు మోడీ ప్రభుత్వం సాయాన్ని సవరించగా, అంతకంటే ఎపిలో ఎక్కువ సాయం ఇస్తున్నందున, కేంద్ర ఆదేశాలను స్వీకరిస్తూనే, హుదూద్‌ నాటి సాయాన్ని కొనసాగిస్తూ 2015 డిసెంబర్‌ 12న జివొ 15 జారీ చేసింది. కేంద్రం సూచనల మేరకు పరిహారం పరిమితిని 50 శాతం నుండి 33 శాతానికి సవరించింది. అంతకుముందు 50 శాతం పంట నష్టపోతేనే పరిహారం ఇచ్చేవారు. ఇప్పుడు 33 శాతం డ్యామేజి అయినా ఇస్తున్నారు. ఆ జీవోనే ఇప్పటికీ అమల్లో ఉంది. గడచిన ఏడేళ్లలో సాగు ఖర్చులు కొన్ని రెట్లు పెరిగాయి. కోవిడ్‌ సంక్షోభం, డీజిల్‌, పెట్రోలు ధరల పెరుగుదల రైతులకు భారంగా పరిణమించాయి. అయినా సర్కారు పరిహారం పెంచట్లేదు. కేంద్రంతో సంబంధం లేకుండా స్థానిక పరిస్థితుల కనుగుణంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని పెంచిన సందర్భాలున్నాయి. వైసిపి సర్కారు ఆ దిశగా ఆలోచించట్లేదని విమర్శలొస్తున్నాయి.

పిసరంత పరిహారం