Dec 27,2022 19:51

కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌: నిబంధనలు పేరిట అర్హులైన చేనేత కార్మికులకు చేనేత పింఛన్లు తొలగించడం చాలా బాధాకరమని బిసి సంక్షేమ సంఘం చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఓర్సు వీరభాస్కర్‌ అన్నారు. మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ కె.ప్రమీలకి చేనేత కార్మికులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ అసలే వర్షాల కారణంగా పనులు లేక చేనేత కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. నిబంధనల పేరిట ప్రతి నెలా వచ్చే చేనేత పెన్షన్లను తొలగించడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే అప్పులు ఊబిలో కూరుకుపోయిన చేనేతలకు అండగా నిలవాల్సింది పోయి, వారిని మరింతగా కష్టాల్లోకి నెట్టడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు పట్టా కలిగిన అందరికీ పింఛన్లు నేతన్నలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.నేతన్నలు మరణించిన అనంతరం రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేసియా పథకం,సిల్కు రాయితీ పాస్‌ పుస్తకాలు ప్రారంభించాలని, రేషాలు, వార్పులు, జరీ అధిక ధరలు తగ్గించాలని, జిఎస్‌టి పూర్తిగా రద్దు చేయాలని, ఐసిఐసిఐ హెల్త్‌ స్కీం తదితర పథకాలను చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సత్యసాయి జిల్లా అధ్యక్షులు పాలినేని నరసింహులు, అన్నమయ్య జిల్లా చేనేత ఉపాధ్యక్షులు సాదినేని రమేష్‌ నాయుడు, చేనేత కార్మికులు అడపా బాలాజీ, ఇ.వెంకటేశ్‌.కె.జనార్దన్‌, వై.మనోహర్‌, అక్బర్‌ బాషా, కె.రామచంద్ర, కె.చంద్ర, నాగిరెడ్డి, బాబురెడ్డి, శ్రీరాములు, రమేష్‌, కృష్ణ, శంకర పాల్గొన్నారు.