May 23,2022 23:27

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే జగన్మోహనరావు

ప్రజాశక్తి-కంచికచర్ల : విద్యుత్‌ బిల్లులు అధికంగా వచ్చాయనే సాకుతో పెన్షన్లు తొలగించారని పలువురు ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు వద్ద మొరపెట్టుకున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం స్థానిక ఒకటో వార్డు పరిధిలో పాత పోస్టాఫీసు బజారు, పెద్ద బజారులో ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు ఇంటింటికి తిరిగి వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు తీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పెన్షన్లు తొలగించిన తీరును, రేషన కార్డలు తొలగించారని ఆయన దష్టికి తీసుకువచ్చారు. మరికొందరు త్రాగునీరు సమస్య గురించి ప్రస్తావించారు. త్రాగునీరు సక్రమంగా రావటం లేదని, 25 రోజులకు ఒకసారి వచ్చే నీరు కూడా, మురుగు తో దుర్వాసన వెదజల్లుతున్నాయని వాటిని తాగి రోగాల బారిన పడుతున్నామని పలువురు ఎమ్మెల్యే దష్టికి తీసుకువచ్చారు. ప్రధాన వీధి ఐన పెద్దబజారులోనే పక్కా డ్రైన్ల సౌకర్యం లేక పోవటం వల్ల ఇళ్ళల్లో వాడకం నీరు కూడా పారుదల కాక రోజుల తరబడి నిల్వ ఉండటం వల్ల దుర్వాసన వస్తుందని, వర్షాకాలంలో పరిస్థితి దారుణంగా ఉంటుందిని పలువురు మహిళలు వాపోయారు. స్థానిక పెద్ద బజారులో గల కన్యకాపరమేశ్వరి కళ్యాణ మండపం నుండి చెత్తా చెందారుం, మురుగు నీరు వల్ల చుట్టుపక్కల ఉండలేక పోతున్నట్లు పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్రాగునీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పట్టణ వైసిపి అధ్యక్షుడు వేమా సురేష్‌ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచి వేల్పుల సునీత, ఎంపిపి షేక్‌ మలక్‌ బషీర్‌, ఎయంసి ఛైర్మన్‌ మార్త రజిని, నాయకులు కాలవ వాసుదేవరావు, బండి మల్లిఖార్జునరావు, పాటిబండ్ల హరి, చింతా రవి, పరిటాల రాము తదితరులు పాల్గొన్నారు.