Jan 04,2023 21:46

ఫొటో : పింఛన్‌ అందజేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

పింఛన్‌ వారోత్సవాల్లో విక్రమ్‌రెడ్డి
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ఆవరణలో పెన్షన్‌ వారోత్సవాలలో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల విషయంలో చిన్నచిన్న సమస్య ఉందని పాత పెన్షన్ల సమస్య పరిష్కరించామన్నారు. ఎవరూ ఇంటి నుండి బయటకు వెళ్లొద్దని వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి పనిచేస్తారని తెలిపారు. ఇంతకు ముందులా కమిటీల దగ్గరకు, పార్టీ రంగు వేసుకొని ఎవ్వరికీ చెప్పుకోవలసిన పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పెన్షన్‌ మంజూరు చేస్తుందని తెలిపారు. ఆధార్‌ కార్డులో వయస్సు ఎక్కువ తక్కువ ఉండొచ్చు గానీ ఆపని ఇప్పుడు చేయాలంటే సమయం పడుతుందన్నారు.
అలాంటి వారి జాబితాను తయారు చేయాలని, అర్హత ఉన్నవారికి పెన్షన్‌ మంజూరు చేయిస్తానని ఎంఎల్‌ఎ హామీనిచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే రూ.2.50వేల కోట్లు ఖర్చు పెట్టారని, 90శాతం బ్యాంక్‌ అకౌంట్‌లో పడగా పెన్షన్‌ మాత్రమే అందిస్తున్నామన్నారు. పేదలను అభివృద్ధి పథంలో నడిపించాలని, విద్య అందరికీ అందించాలని, మహిళలు వ్యాపారంలో ఆర్థికంగా వృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని, వారికలలు సాకారమయ్యేందుకు మండల స్థాయి ప్రజా ప్రతినిధులు అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మీదేవి, కన్వీనర్‌ సుబ్బిరెడ్డి, మాజీ కన్వీనర్‌ శ్రీనివాసులునాయుడు, వైసిపి నాయకులు సిద్ధంరెడ్డి మోహనరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రవీంద్రబాబు, ఎంపిడిఒ నాగమణి, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, వాలంటీర్లు, నాయకులు పాల్గొన్నారు.