Mar 10,2023 22:07

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

       పుట్టపర్తి అర్బన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పిఒలు, ఏపీవోల పాత్ర ఎంతో కీలకమని, వీరందరూ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని కలెక్టర్‌ పి.బసంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈనెల 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామంలో శుక్రవారం నిర్వహించిన రెండవ విడత శిక్షణ తరగతుల్లో పీవోలు, ఏపీవోలు, జోనల్‌ ఆఫీసర్లకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పీవోలు, ఏపీవోలు, జోనల్‌ ఆఫీసర్లు సయోధ్యతో పని చేయాలన్నారు. ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌పై బాధ్యత ఎక్కువగా ఉంటుందన్నారు. బ్యాలెట్‌ పేపర్‌ ఎలా ఉపయోగించాలి, ఫోల్డ్‌ చేసే విధానం, సీల్‌ చేసే విధానం తదితర అంశాలపై అవగాహన ఉండాలన్నారు. తాను, ఎస్పీ పోలింగ్‌ పోలింగ్‌ అయ్యేంతవరకు పోలింగ్‌ స్టేషన్ల వద్ద అందుబాటులో ఉంటామన్నారు. ఎలాంటి సందేహం వచ్చినా తమను సంప్రదించాలన్నారు. సిబ్బంది ఎన్నికల విధులను క్షుణ్నంగా తెలుసుకుని పనిచేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ మాట్లాడుతూ మార్చి 12న ఉదయం 7 గంటలకు డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రానికి చేరుకుని పోలింగ్‌కి సంబంధించిన సుమారు 30 దాకా ఉన్న వివిధ వస్తుసామగ్రిని తీసుకుని చెక్‌ లిస్ట్‌ ప్రకారం వాటిని సరిచూసుకోవాలన్నారు. బ్యాలెట్‌ బాక్స్‌ ల నిర్వహణ పనితీరు, పిఓ డైరీ, పోలింగ్‌ అనంతరం ఆయా ఏజెంట్ల సంతకాల సేకరణ, బ్యాలెట్‌ బాక్స్‌ సీలింగ్‌ తదితర అంశాలలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ముందస్తుగా, ప్రణాళికాబద్ధంగా విధులు చేపట్టాలన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో డిఆర్‌ఒ కొండయ్య, ట్రైనింగ్‌ మేనేజ్‌మెంట్‌ అధికారి డీఆర్డీఏ పీడీ నరసయ్య, బ్యాలెట్స్‌ పేపర్స్‌ నోడల్‌ అధికారి, హౌసింగ్‌ పీడీ చంద్రమౌళి రెడ్డి, మాస్టర్‌ ట్రైనర్లు చిన్నయ్య, ఖతీజుతిన్‌ కుబ్రా, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ ఆనంద్‌, డిప్యూటీ తహసీల్దార్లు మైనుద్దిన్‌, నరసింహులు పాల్గొన్నారు.