ధర్మవరం టౌన్ : పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, యూటిఎఫ్, ఎస్‌టియు, ఇతర ప్రజా సంఘాలు బలపరిచిన రాయలసీమ పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఎన్జీవో హోంలో రాజ్యాంగ విలువలు, ప్రజాతంత్ర హక్కులను కాపాడుకుందాం అనే అంశంపై యుటిఎఫ్ శ్రీసత్యసాయి జిల్లా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్.జయచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, లౌకిక విధానం ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. ప్రజాతంత్ర హక్కులు, ప్రశ్నించే తత్వం స్వేచ్ఛగా ప్రదర్శనలు చేయకుండా నిషేధం, సాధారణ నిరసనలను సైతం తెలియజేసే ప్రజాస్వామ్య వాతావరణం కూడా లేని పరిస్థితులు నేటి ప్రభుత్వ పాలకులు తెచ్చిపెట్టారని తెలిపారు. ప్రజాతంత్ర హక్కులని కాపాడుకోవడం కోసం పీడీఎఫ్, యూటిఎఫ్, ప్రజా సంఘాలు నిలబెట్టిన పశ్చిమ రాయలసీమ టీచర్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, గ్రాడ్యుయేట్ అభ్యర్థి పోతుల నాగరాజులకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవాలని తెలియజేశారు. రాష్ట్రంలో విద్యా రంగంలో సంస్కరణల పేరుతో పాఠశాలలు విలీనం, ఉపాధ్యాయుల సంఖ్యని కుదించడం లాంటి చర్యలను ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. సంస్కరణలు అభివద్ధికి ఉపయోగపడాలి తప్పా, విద్యా విధానం పతనంకు కారణం కాకూడదన్నారు. పాదయాత్ర సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ రూ.1848 కోట్లు బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహరెడ్డి, పోతుల నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యల పరిష్కరించడానికి తమవంతు కషి చేస్తామన్నారు. ఎన్నికల్లో తమను గెలిపించి ఆదరించాలని కోరారు. యూటిఫ్ రాష్ట్ర కార్యదర్శి వి.కోటేశ్వరప్ప మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మున్సిపల్ ప్రదానోపాధ్యాయులకు డిడిఒ పవర్స్ ఇవ్వాలని కోరారు. యూటీఫ్ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎస్.జయచంద్రారెడ్డి, కె.నాగేంద్ర మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి యుటిఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ మాట్లాడుతూ నిజాయితీ, నిబద్ధతగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రజా పక్షమై ఉంటారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వీరికి మద్దతు ఇచ్చి, అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజా తంత్ర ఉద్యమాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జెవివి నాయకులు ఆదిశేషులు, యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.భూతన్న, సహాధ్యక్షులు జిహెచ్.బాబు, కోశాధికారి ఎం.సుధాకర్, జిల్లా కార్యదర్శులు సి.తాహెర్ వలి, డి.శ్రీనివాసులు, ఈ.నారాయణ స్వామి, ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.ఆంజినేయులు, రామకృష్ణ నాయక్ వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










