Feb 08,2023 22:11

ఫొటో : సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం

పిహెచ్‌సిలో మార్చురీ ఏర్పాటు చేయాలి
- మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించిన సభ్యులు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : ఇందుకూరుపేట పిహెచ్‌సి పరిధిలో మార్చురీని ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని సమావేశం దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు. ఎంపిపి శంకరయ్య అధ్యక్షతన బుధవారం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిటిసిలు, సర్పంచులు తమతమ సమస్యలపై సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లకు ఇతర సంఘటనలతో మృతి చెందిన వారికి నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహణ ఆలస్యం కావడంతో పలు ఇబ్బందులు పడుతున్నారని సకాలంలో వైద్యులు లేకపోవడం సమస్యగా మారుతుందన్నారు.
ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఇందుకూరుపేట పిహెచ్‌సి పరిధిలో మార్చురీ ఏర్పాటు చేసి పోస్టుమార్టం ప్రక్రియ ఆలస్యం లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా మండలంలో 18 సచివాలయాలకు 104 సేవలు అందకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 104 సేవలు అన్ని సచివాలయాలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వారైతుల విషయంలో ఆక్వాజోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌ విషయంలో సమస్యలను ప్రస్తావించగా అందుకు సంబంధిత శాఖ అధికారులు 2018 సంవత్సరం నిబంధన అనుసరించి రేట్లు నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో సొసైటీ అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులురెడ్డి, రావూరు సర్పంచ్‌ ఉడతా వెంకటశేషయ్య, దేవిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్లు, ఎంపిటిసిలు, సర్పంచులు, ఎంపిడిఒ కల్పన, తహశీల్దారు సుబ్బయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.