అనంతపురం ప్రతినిధి : జిల్లాలో ప్రధానమైన జలాశయాల్లో పెన్నఅహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పిఎబిఆర్) ఒకటి. 11 టిఎంసిల నిలువ సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే అనేక లోపాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇప్పటికి ఐదున్నర టిఎంసిలకు మించి నిలువ చేయలేని పరిస్థితుల్లో ప్రాజెక్టు ఉంది. క్రస్టు గేట్లు స్లూయిస్ నుంచే నీరు లీకేజీ అవుతోంది. దీన్ని నివరించేందుకు గ్రౌటనింగ్ పనులు చేశారు. అయినా పూర్తి స్థాయిలో నిలువరించలేకపోయారు. వర్షాలు అధికంగా వచ్చినా అవకాశముండి నీటిని నిలువ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు లోపలి భాగంలో జియో మెమ్రైన్ చేసి నీటిని నిలువ చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్నా డ్యామ్ రిహాబిటేషన్ అండ్ ఇప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (డ్రిప్) కింద దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు చేపడుతోంది. మూడు విడతల్లో చేపడుతున్న పనుల్లో మొదటి విడతలో కొన్ని పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండో విడత కింద ఆయా రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించి అవసరమనకున్న ప్రాజెక్టులను పరిశీలించి పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రెండో విడత కింద రాష్ట్రంలో నాలుగు ప్రాజెక్టులను కేంద్ర నిపుణుల బృందం పరిశీలించనున్నారు. ఈ నెల మూడవ వారంలో ఈ బృందం రాష్ట్రానికి వచ్చే అవకాశముంది. అందులో జల్లాలోని పిఎబిఆర్ ప్రాజెక్టు ఉన్నట్టు సమాచారం. దీంతోపాటు ప్రకాశం జిల్లాలో రోళ్లపాడు, పశ్చిమగోదావరి జిల్లాలో తమ్మిలేరు. కడప జిల్లాలో సోమశిల ప్రాజెక్టులున్నట్టు సమాచారం. నిపుణుల బృందం పరిశీలించి ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ ఆవశ్యమని భావిస్తే డ్రిప్ కింద చేర్చడం జరుగుతుంది. తద్వారా ప్రత్యేకంగా నిధులను విడుదల చేసే అవకాశమున్నట్టు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సమాచారం రావడంతో జిల్లాలోని జలవనరుల శాఖ అధికారులు నివేదికలను రూపొందించే పనిలో పడ్డారు. ఈ ప్రాజెక్టు అవశ్యకత, డ్యామ్ లోటుపాట్లను నిపుణుల బృందానికి వివరించే పనిలో నిమగమయ్యారు. ఈ బృందానికి సరైన సమాచారాన్ని అందించి, ప్రాధాన్యతను వివరించేందుకు వీలుగా జలవనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ప్రధానమైన ప్రాజెక్టు కూడా కావడంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. కమిటీ ఈ ప్రాజెక్టు డ్రిప్ జాబితాలో చేరిస్తే ఇప్పటి వరకున్న ఆటంకాలు, సమస్యలు కొంత వరకు తొలగి, పూర్తి స్థాయి సామర్థ్యంతో రిజర్వాయర్‌లో నీరు నిలువ ఉంచేందుకు వీలు కలుగుతుంది.
నివేదికలు రూపొందిస్తున్నాం
రాజశేఖర్‌బాబు, హెచ్‌ఎల్‌సి, ఎస్‌ఇ
కేంద్ర నిపుణుల బృందం వస్తున్నట్టు ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. ఈ మేరకు అవసరమైన నివేదికలను ఇంజనీర్లను ద్వారా రూపొందించే పనిలో ఉన్నాం. వారు వచ్చే సమయానికి అన్ని సిద్ధం చేసి ప్రాజెక్టు ఆవశ్యకతను వారికి వివరించి జిల్లాకు ప్రధాన ప్రాజెక్టును డ్రిప్‌లో ఉండే విధంగా కృషి చేస్తాం.










