Jan 06,2023 22:11

ఫొటో : పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరావు

పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్థిని గెలిపించాలి
ప్రజాశక్తి-సీతారామపురం : ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వంపై పోరాడే అభ్యర్థులకే పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టం కట్టాలని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల వెన్ను విరిచే నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. దీనిని అరికట్టదానికి పిడిఎఫ్‌ అభ్యర్థులు శాసనమండలిలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాల సైతం పడలేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులపై ఎంత కక్షాదింపు చర్యలు చేపడుతుందో అర్థం అవుతుందని తెలిపారు. సిపిఎస్‌ రద్దు చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలోకి తొక్కి కమిటీల ద్వారా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రతిఒక్క పట్టభద్రుడు బుద్ధి చెప్పాలన్నారు.
ఉద్యోగుల పిఎఫ్‌ డబ్బులు స్లిప్పుల రూపంలోనే కనిపిస్తున్నాయని పిఎఫ్‌ నిధులు సైతం ప్రభుత్వం తన సొంత ప్రయోజనాలకు ఖర్చు చేసుకోవడం చాలా దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా తెలిపిన ప్రభుత్వం ప్రస్తుతం 50 వేల టీచర్‌ పోస్టులను లేకుండా చేసిందన్నారు. తాను ఎంఎల్‌సిగా గెలిస్తే నిరుద్యోగ, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై శాసనమండలిలో నిత్యం పోరాటం చేస్తానన్నారు. శనివారం మండలంలోని అన్ని పాఠశాలలను సందర్శిస్తానన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎడమ తిరుపతయ్య, యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొడ్లవీటి వెంకటేశ్వర్లు, ప్రతాప్‌, భోగ్యం శ్రీనివాసులు, పిసిఎం. కొండయ్య, అన్నంగి ప్రసాదు, డ.వెంకటేశ్వర్లు, రంతుజాని, జయరామిరెడ్డి, ఎ.వి.రమణయ్య తదతరులు పాల్గొన్నారు.