Mar 11,2023 21:29

ఫొటో : మాట్లాడుతున్న నాయకులు

పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి-సీతారామపురం : తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎంఎల్‌సి పిడిఎఫ్‌ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి, టీచర్‌ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిలను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె.అజరుకుమార్‌, సీనియర్‌ నాయకులు మాదాల వెంకటకృష్ణ పేర్కొన్నారు. శనివారం సీతారామపురంలో చివరి రోజు ప్రచారంలో భాగంగా విలేకరులతో మాట్లాడుతూ తూర్పు రాయలసీమ ఎంఎల్‌సి అభ్యర్థులుగా గత 30, 40 ఏళ్లుగా పోరాడే ఉద్యమకారులను ఓటర్లు ఎన్నుకుంటున్నారని, ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే తీరు కొనసాగుతుందన్నారు. అధికార పార్టీ యంత్రాంగం డబ్బు దొంగ ఓట్లతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న వారిని నమ్మకుండా ప్రజల సమస్యలపై పోరాటం చేసే వ్యక్తుల పక్షాన నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పట్టబద్రుల హక్కులు పూర్తిగా అణచివేస్తూ తొక్కుతూ అధికార పార్టీ పాలన సాగిస్తుందని గత ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా ఈ నాలుగు సంవత్సరాల అధికారంలో మరింతగా ఉపాధ్యాయులు ఉద్యోగస్తుల నిరుద్యోగుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తుందన్నారు. 13వ తేదీన జరిగే ఎన్నికలు అధికార పార్టీకి చంపపెట్టుగా ఉండబోతుందని జోస్యం చెప్పారు. ఉపాధ్యాయ ఉద్యోగ పట్టభద్రులు అందరు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నారన్నారు. డబ్బు సంచులు మందు పంపిణీతో ఉపాధ్యాయ ఉద్యోగులను, నిరుద్యోగ పట్టభద్రులను కొనుగోలు చేస్తామని ధీమాతో అధికార పార్టీ నాయకులు ఉన్నా ఓటర్లందరూ పిడిఎఫ్‌ అభ్యర్థికే పట్టం కట్టాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. ప్రస్తుతం వ్యవస్థ ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నందున ఓటర్లందరూ పెద్దల సభలోనైనా సమస్యలపై మాట్లాడి వ్యవస్థకు ఉపయోగపడే వ్యక్తులను ఎన్నుకోవాలని కోరామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల, పట్టభద్రుల, నిరుద్యోగులపై కక్ష సాధింపు చర్యలను చేపట్టిందన్నారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను గుర్తించి సరైన ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలపై పోరాడే పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కాకు వెంకటయ్య, కోడె రమణయ్య పాల్గొన్నారు.