పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి-అల్లూరు : ప్రభుత్వ భవనాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య కావాలంటే పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థులైన మీగడ వెంకటేశ్వర్లు రెడ్డి, పోక్కిరెడ్డి బాబురెడ్డిని గెలిపించాలని ప్రజాసంఘం నాయకులు పాటి భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రం బస్వారెడ్డి శంకరయ్య భవనంలో మండల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికలకు ఎన్నడూ లేని విధంగా రాజకీయ రంగు పులిమి పార్టీలు పబ్బం గడుపుతున్నాయని ఎద్దేవా చేశారు. గతంలో పిడిఎఫ్ అభ్యర్థులు గెలుపొంది శాశ్వత భవనాలను కట్టించి విద్యా హక్కుల కోసం అనేక పోరాటాలు సాగించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు షేక్ అబ్దుల్‌రషీద్, రఘురాం రెడ్డి, విజయలక్ష్మి, వెంకయ్య, రమణయ్య, ఆదెయ్య తదితరులున్నారు.










