ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ పీడీఎఫ్ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలను గెలిపించాలని కోరుతూ ధర్మవరం పట్టణంలో సిపిఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం నాడు ప్రచారం నిర్వహించారు. సుందరయ్య నగర్, దుర్గానగర్, పార్థసారధి నగర్‌లలో పట్టభద్రులు, ఉపాధ్యాయులను కలిసి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పి.నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే ప్రజా గొంతుకలుగా చట్ట సభల్లో ప్రజల పక్షాన ప్రభుత్వాలను ప్రశ్నిస్తారన్నారు. అంతేగాకుండా నిరుద్యోగులకు ఉపాధి, ప్రజా, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం, పరిశ్రమల ఏర్పాటు వంటి సమస్యలను మండలిలో నిలదీయాలంటే తప్పనిసరిగా పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జంగాలపల్లి పెద్దన్న, జెవివి నాయకులు డా||ఆదిశేషు, రైతుసంఘం నాయకులు మారుతి, సిఐటియు నాయకులు ఎస్‌హెచ్.బాషా, ఆదినారాయణ, చేనేత కార్మిక సంఘం నాయకుడు వెంకటస్వామి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నాగార్జున పాల్గొన్నారు.
లేపాక్షి : పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ మండల కన్వీనర్ రామాంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్, ఎంజెపి గురుకుల పాఠశాల, జవహర్ నవోదయ విద్యాలయం, లేపాక్షి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే వ్యక్తి లేకపోవడం వల్లే సిఎం జగన్ అభివృద్ధిని విస్మరించారన్నారు. కావున మండలిలో ప్రశ్నించే పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లేపాక్షి ఇన్‌ఛార్జి సద్రుఖాన్, కాంగ్రెస్ బి బ్లాక్ మండల ఉపాధ్యక్షులు గంగాధరప్ప, మండల ఉపాధ్యక్షులు బాబు, నాయకులు నారాయణస్వామి, అనంతకుమార్, ఆదినారాయణ, అశోక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఓటర్లను అభ్యర్థిస్తున్న సిపిఎం నాయకులు










