పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం
ప్రజాశక్తి-అనంతసాగరం : పిడిఎఫ్ తరుఫున పోటీ చేస్తున్న ఎంఎల్‌సి అభ్యర్థులు పట్టభద్రుల అభ్యర్థి మీగడ వేంకటేశ్వర్లు రెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిని గెలిపించాలని మండలంలోని సచివాలయాలు, ఎంపిడిఒ ఆఫీస్, తహశీల్దార్ కార్యాలయం, ఎంఇఒ ఆఫీసు, వెలుగు ఆఫీస్‌లలో ఎన్నికల ప్రచార కమిటీ సోమవారం ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ శాసనమండలిలో నిరుద్యోగ, చిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు వెట్టి చాకిరి విధానం రద్దు కోసం, రెగ్యూలర్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం, సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్‌ను పునరుద్ధరణ చేయాలని పోరాటం చేస్తున్న ఎంఎల్‌సిలు పిడిఎఫ్ తరుఫున గెలిచినవారన్నారు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గ ఉద్యమాలకు అండగా పిడిఎఫ్ ఎమ్మెల్సీలు అని పేర్కొన్నారు. కావున ఓటు కలిగిన పట్టభద్రులు ప్రతిఒక్కరూ పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ సీనియర్ నాయకులు, ఎంఎల్‌సి ఎన్నికల కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ ఎస్‌డి.వల్లిఅహ్మద్, సిఐటియు మండల కార్యదర్శి అన్వర్ బాషా, జెవివి నాయకులు డాక్టర్ సుబ్బారాయుడు, రైతు సంఘం నాయకులు ఉప్పలపాడు మస్తాన్, రాటకొండ పెంచలనాయుడు తదితరులు పాల్గొన్నారు.










