ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో, కలెక్టరేట్ (విశాఖ) : ఎల్‌ఐసి ఎంబెడెడ్ విలువను లెక్కకట్టడం అసాధ్యమన్నది నిపుణుల నివేదిక! ఎల్‌ఐసి ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు అది సాగించిన ప్రస్థానం, సాధించిన గుడ్‌విల్, స్థిర, చరాస్తులతో పాటు దేశానికి ఆ సంస్థ చేసిన సేవలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఎల్‌ఐసి ఎంబెడెడ్ విలువ అనంతమని వారు తేల్చారు. ఈ అమూల్యమైన సంపదను మూడు లక్షల కోట్ల రూపాయలుగా లెక్కించి ప్రైవేటుకు తెగనమ్మడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఈ విలువను ఎలా నిర్ధారించారన్న ప్రశ్నకు సమాధానమివ్వకుండా, నిరసనలను బేఖాతరు చేస్తూ ఐపిఒకు ప్రణాళికను ప్రకటించింది. ఇలా ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల విలువను అడ్డగోలుగా తగ్గించి ప్రైవేటుకు అప్పనంగా అప్పచెప్పడం ఇదే మొదటిసారి కాదు. విశాఖలోని హిందుస్థాన్ జింక్ పరిశ్రమ విషయంలో ఇలాగే జరిగింది. తాజాగా విశాఖ ఉక్కు విషయంలోనూ జరుగుతోంది. జింక్ పరిశ్రమ వాటాల విక్రయాలపై సిబిఐ విచారణను అడ్డుకోవాలని ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వం... సుప్రీంకోర్టు తిరస్కారంతో వెనక్కి తగ్గడంతో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల విక్రయాలు జరుగుతున్న తీరు తాజాగా చర్చ నీయాంశమైంది.
జింక్‌లో ఏం జరిగింది?
1971-74 సంవత్సరంలో ప్రభుత్వ రంగంలో హిందుస్థాన్ జింక్ పరిశ్రమ విశాఖలో ఏర్పాటైంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 365 ఎకరాల భూములను మింది, చుక్కవానిపాలెం, ములగాడ, నక్కవానిపాలెంలోని 360 మందికిపైగా రైతుల నుంచి సేకరించింది. సజావుగా లాభాలతో సాగుతున్న ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని 2002లో వాజ్‌పేయి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి ధరల ప్రకారం రూ.10వేల కోట్లు రిజర్వు నిధులున్న ఈ సంస్థ షేర్లలో 26 శాతాన్ని కేవలం రూ.445 కోట్లకు యాజమాన్య హక్కులతో కలిపి వేదాంత సంస్థకు తెగనమ్మేసింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ ప్రక్రియకు సహకరించారు. అప్పటి నుండి 2013 వరకు విడతల వారీగా 73 శాతం వాటాలను వేదాంత కంపెనీకి అమ్మేశారు. ఈ ప్రక్రియపై కార్మికులతోపాటు, భూ యజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. గత ఏడాది నవంబర్‌లో ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.
దీనిపై విచారించిన ధర్మాసనం సిబిఐ విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించి సిబిఐ సమర్పించిన ప్రాథమిక నివేదికలో సంస్థ ఆస్తుల విలువ గణనీయంగా తగ్గడానికి సంబంధించి పలు కీలక అంశాలను ధర్మాసనానికి నివేదించినట్లు సమాచారం. ఈ నివేదికలో కొందరి పేర్లను కూడా సిబిఐ పేర్కొంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ 'సిబిఐ సమర్పించిన కొన్ని కీలక వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై మేం వ్యాఖ్యానించం. దీనివల్ల కేసు దర్యాప్తునకు ఆటకం ఉంటుంది' అని ధర్మాసనం పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ వింత వైఖరి!
ఈ విచారణ ప్రక్రియపై నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సిబిఐ విశ్వసనీయతను దెబ్బతీసే అనేక ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం చేసింది. సిబిఐ సమర్పించిన ప్రాథమిక అంశాలు తప్పని, సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందని పేర్కొంది. జింక్ వాటాల విక్రయం సక్రమంగానే సాగినందున సిబిఐ విచారణ అవసరం లేదని, ఆ మేరకు ఉత్తర్వులివ్వాలని ధర్మాసనాన్ని కోరింది. అయితే, తాజా విచారణలో న్యాయమూర్తి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తాను దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్రం ఉపసంహరించుకుంది. దీంతో, సిబిఐ విచారణకు లైన్ క్లియర్ అయింది. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేస్తుందన్న సంకేతాలతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇవీ అనుమానాలు
జింక్ వ్యవహరంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ సమర్పించిన ప్రాథమిక నివేదికలో ఏం పేర్కొంది? 2002లో జరిగిన అమ్మకపు ప్రక్రియకు ప్రాతిపదిక ఏమిటి? ధరను భారీగా తగ్గించడం వెనుక ఏం జరిగింది? ధర్మాసనం పేర్కొన్న వ్యక్తులెవరు? అనే అంశాలు వెలుగులోకి రావాల్సి ఉంది. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంలోనూ ఇటువంటి అక్రమాలపై నిగ్గు తేల్చాల్సి ఉంది.
సుప్రీం కోర్టు ఆదేశాలపై హర్షం : సిఐటియు
విశాఖలోని హిందుస్థాన్ జింక్ పరిశ్రమ అమ్మకంపై విచారణ కొనసాగించాలని సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం పట్ల సిఐటియు, హిందుస్థాన్ జింక్ పోరాట కమిటీ హర్షం వ్యక్తం చేశాయి. సిఐటియు విశాఖ నగర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు విశాఖ నగర ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడుతూ ఇప్పటికీ 29.5 శాతం షేర్లు భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని, వీటిని కూడా పబ్లిక్ ఆఫర్ కింద ఇచ్చుకోవచ్చని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిందని తెలిపారు. దీన్ని ఆసరాగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం... 2002లో జరిగిన అవకతవకలపై విచారణ జరగకుండా చూడాలని కుట్రపూరిత ఆలోచనతో చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం అనేది, అవినీతి, అక్రమాలతో కూడుకున్నదని స్పష్టమవుతోందని తెలిపారు. హిందుస్థాన్ జింక్ పోరాట కమిటీ కన్వీనర్ పి.నారాయణ మూర్తి మాట్లాడుతూ ఇప్పటికీ వేదాంత కంపెనీ జింక్‌లోని 210 మంది కార్మికులకు ఫైనల్ సెటిల్మెంట్ చేయలేదన్నారు. వీరు లేబర్ కోర్టులో కేసు వేయగా కార్మికులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందని, రూ.14,25,82,000 చెల్లించాలని ఆదేశించిందని తెలిపారు. దీనిపై వేదాంత కంపెనీ హైకోర్టులో అప్పీలు చేసిందన్నారు. లెడ్ ప్లాంట్‌లోని 178 మంది కార్మికులకు రూ.10 కోట్లు బకాయిలు ఈనాటికీ చెల్లించలేదని తెలిపారు. సమావేశంలో సిఐటియు నగర అధ్యక్షుడు కెఎం.శ్రీనివాసరావు, పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్.జ్యోతీశ్వరరావు పాల్గొన్నారు.










